‘నగరాలకు దీటుగా పల్లెల్లోనూ పోలీస్ సేవలు అందుతున్నాయి.. ఒకప్పుడు పోలీసులంటే భయపడే జనం.. నేడు స్నేహపూర్వకంగా తమ సమస్యలను పోలీసులకు చెప్పుకుంటున్నారు..’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం కేశంపేట మండల కేంద్రంలో రూ. 80 లక్షలతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించి, అనంతరం మంత్రి మాట్లాడారు. ఉత్తమ సేవలందిస్తున్న తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా షీ టీమ్స్‌లను ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తున్న ఘనత తెలంగాణ పోలీసులకు దక్కిందన్నారు. 100కు ఫోన్ చేసిన 5 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని సేవలందిస్తున్నారన్నారు. నేరాలను అదుపు చేసేందుకు మారుమూల పల్లెల్లో సైతం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. పదే పదే నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం కేశంపేట పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ను మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు.
షాద్‌నగర్, డిసెంబర్ 16 : నగరాలకు దీటుగా మారుమూల గ్రామాల్లోనూ తెలంగాణ పోలీస్ సేవలు అందుతున్నాయని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి కేశంపేటలో రూ.80లక్షలతో నిర్మించిన పోలీ స్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని శాఖలను మించి పోలీస్ శాఖను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ఒకప్పుడు పోలీసులంటే భయపడే జనం నేడు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారన్నారు. పార్టీలు, వర్గాలు, మతాలకు అతీతంగా రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణంలో పోలీస్ సేవలు కొనసాగడం సంతోషకరమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్‌లను ఏర్పాటుచేసి ప్రత్యేక చర్యలు తీసుకున్న ఘనత కూడా తెలంగాణ పోలీసులకు దక్కిందన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో కనిపించే పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాలు, నేడు మన రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసుకున్నామన్నారు. దేశంలోని సీసీ టీవీ కెమెరాల్లో మన రాష్ట్రం వాటా 64 శాతమని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం సుమారు 28 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశామని, పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు కేటాయించామని తెలిపారు. ఆధునిక యుగంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని, ఈ తరహా నేరాలను అదుపుచేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటీవలి కాలంలో ఎన్నో నేర సంఘటనల కేసులను ఛేదించారని తెలిపారు. 100కు ఫోన్ చేస్తే 5 నిమిషాల వ్యవధిలో పోలీసులు మీ వద్దకు వస్తారనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లోనూ పోలీస్ పెట్రోలింగ్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన చోట పోలీసుల వసతి గృహాలను నిర్మిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో ఏసీపీ కుషాల్కర్, షాద్‌నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ విశ్వస్వరూప్, కేశంపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాజేశ్వరి, ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీలు విశాల, వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ యాదయ్య, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ చైర్మన్ విశ్వం, వైస్ చైర్మన్ నటరాజన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, మంజుల, సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, దేవేందర్‌యాదవ్, శ్రీశైలం, జగదీశ్వర్, విశ్వనాథ్, నారాయణరెడ్డి, జమాల్‌ఖాన్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, అధికారులున్నారు.
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
కేశంపేట, డిసెంబర్ 16 : పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. కేశంపేటలోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ.9 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్‌ను హోంమంత్రి మహమూద్‌అలీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కోలేటి దామోదర్, వాణీదేవితో కలిసి ఆమె ప్రారంభించారు.
పాఠశాలలు, గురుకులాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకులాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత చదువులు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం విద్యాభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. మండల కేంద్రంలో ప్రత్యేక బాలికల ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలని సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు మంత్రిని కోరగా.. పాఠశాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డికి మంత్రి సబితారెడ్డి సూచించారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం : జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి
అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. కేశంపేటలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రులు మహమూద్‌అలీ, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలతో కలిసి ఆమె ప్రారంభించారు. రైతుల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిందన్నారు.
పేదలకు అండగా కల్యాణలక్ష్మి : ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
నిరుపేద ఆడబిడ్డల కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నిరుపేదలకు చేయూతనిచ్చేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణ సంక్షేమ ఫథకాలు, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రానున్న రోజుల్లో పేదల సంక్షేమం కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టనుందన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ విశాల, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలున్నారు.