ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 2 : ఖమ్మం ఐటీ హబ్ స్థానిక నిరుద్యోగ యువతకు సమగ్ర వేదికగా నిలిచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఐటీ హబ్ ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆదివారం ఐటీ హబ్‌లో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నగరంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ద్వారా ప్రముఖ 19 ఐటీ కంపెనీల్లో 5వందల మందికి ఉపాధి అవకాశం కల్పించామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన ఐటీ హబ్‌ల్లో ఖమ్మం సమగ్రమైన ఐటీ హబ్‌గా నిలిచిందని, ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా ఆధ్వర్యంలో నగరంలోని టాస్క్ శిక్షణ కేంద్రం అధ్బుతంగా పనిచేస్తుందని అభినందించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఖమ్మం నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతుండడంతో మరిన్ని ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయని అన్నారు. టాస్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కళాశాలల యాజమాన్యాలకు మంత్రి సర్టిఫికెట్లను అందజేశారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతోపాటు బహుమతులు, స్పోర్ట్స్‌మీట్-2021 విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో ఐటీ హబ్ కో-ఆర్డినేటర్, టెక్నోజెన్ సీఈఓ ల్యాక్ చేపూరి, వైస్ ప్రెసిడెంట్ పన్నీర్ సెల్వం, జయ చల్లా, ప్రకాశ్ బత్తినేని, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు, వివిధ కంపెనీల సీఈఓలు అరవింద్, శ్రీనివాస్, మధు, శ్రీధర్, సాగర్, సందీప్, ఉద్యోగులు పాల్గొన్నారు.