ఉస్మానియా యూనివర్సిటీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు రూ.మూడు లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని దక్షిణ భారత రాజకీయ జేఏసీ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఉత్తరభారత రైతులకు సహాయం అందించే ముందు మన రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. ఆ తరువాత దక్షిణ భారత దేశంలోని వేలాది మంది ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం చెల్లించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారందరికీ ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు వారికి ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పరిగి రాములు, దుర్గం శివ తదితరులు పాల్గొన్నారు.