ఎల్ఈడీ కాంతులతో ఔటర్ రింగు రోడ్డు వెలుగులు విరజిమ్ముతున్నది. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు 136 కిలోమీటర్ల ఓఆర్ఆర్ మార్గంలో ప్రభుత్వం రూ.100 కోట్లతో విద్యుద్దీకరణ పనులు పూర్తిచేసింది. ఓఆర్ఆర్ సంగారెడ్డి జిల్లాలో మూడు మండలాల పరిధిలో 25 కిలోమీటర్ల మేర ఉండగా, రింగురోడ్డు జిల్లా ముఖచిత్రాన్ని మార్చేసింది. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణాలు సాఫీగా సాగడంలో రింగురోడ్డు ప్రధాన పాత్ర పోషిస్తున్నది. గురువారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ఈడీ లైటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల వైపు వడివడిగా విస్తరిస్తుండగా, ఇక్కడ ఎకరా లక్షల రూపాయలు ఉన్న భూముల విలువ ఇప్పుడు రూ.కోట్లు పలుకుతున్నది.
పటాన్చెరు, డిసెంబర్ 16 : ఔటర్ రింగురోడ్డు(ఓఆర్ఆర్) ఎల్ఈడీ కాంతులతో వెలిగిపోతున్నది. నగరవాసుల ప్రయాణం సుఖప్రదం చేయడానికి రింగురోడ్డును ఎనిమిది లైన్లతో వేశారు. ఇప్పుడు అదనంగా రింగురోడ్డుపై 136 కిలోమీటర్ల వరకు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. రూ. 100 కోట్లతో విద్యుద్దీకరణ పనులు పూర్తిచేశారు. ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ పద్ధ్దతిలో కాంట్రాక్టర్ ఏడేండ్ల పాటు వాటి నిర్వహణను చూస్తారు. రిమోట్ ద్వారా ఆపరేటింగ్ కొనసాగుతుంది. చెరోవైపు ఒకేమారు నాలుగు వాహనాలు ప్రయాణించే వీలుండటంతో పాటు ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఈ రోడ్డును వేశారు. సంగారెడ్డి జిల్లాలో మూడు మండలాల నుంచి 25 కిలోమీటర్ల మేర రింగురోడ్డు ప్రయాణం కొనసాగుతుంది. రింగురోడ్డు జిల్లా ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఎకరా లక్షల రూపాయలు ఉన్న భూముల విలువ ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరాయి. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల వైపు వడివడిగా విస్తరిస్తున్నది. భారీ వెంచర్లు, నిర్మాణాలు, అపార్టుమెంట్లు, ఐటీ కంపెనీలు, ఫార్మా పరిశ్రమలు, మెడికల్ డివైజ్ పార్కులు, హోటళ్లు వస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణాలు సాఫీగా జరగడంలో రింగురోడ్డు ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ఈడీ లైటింగ్ ప్రారంభమైంది. ఈ కొత్త వెలుగులు సంగారెడ్డి జిల్లాను మరింత ప్రకాశవంతం చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఔటర్ రింగురోడ్డును 2010లో ప్రారంభించారు. అప్పటి నుంచి రింగురోడ్డుపై జిల్లావాసులు ప్రయాణిస్తున్నారు. ఐడీఏ బొల్లారం నుంచి కొల్లూరు వరకు 25 కిలోమీటర్ల వరకు రింగురోడ్డు జిల్లా పరిధిలో ఉంది. రామచంద్రాపురం, జిన్నారం, పటాన్చెరు మండలాల్లోంచి రింగురోడ్డు ఏర్పాటైంది. ఎనిమిది లైన్లతో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో వేసిన రింగురోడ్డుకు హెచ్ఎండీఏ కొత్త హంగులు కల్పిస్తున్నది. 158 కిలోమీటర్ల రింగురోడ్డుపై ఇప్పుడు 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. రూ. 100 కోట్లతో ఈ లైట్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా రిమోట్ కంట్రోల్ ద్వారా వీటిని నియంత్రిస్తారు. రిమోట్ అండ్ ఆపరేటింగ్ పద్ధతిలో కాంట్రాక్టర్ ఎల్ఈడీ లైట్లు, స్తంభాల నిర్వహణ చూస్తారు. ఏడేండ్ల పాటు కాంట్రాక్టర్ వీటిని నిర్వహిస్తాడు, మరమ్మతులు, కొత్త లైట్ల ఏర్పాటు కూడా అతడే చూస్తాడు. 4538 పోల్స్‌ను 136 కిలోమీటర్లలో ఏర్పాటు చేశారు. 9076 ఎల్ఈడీ లైట్లు వెలుగులు చిమ్ముతున్నాయి. 120 వాట్స్ ఎల్ఈడీ లైట్లు ప్రకాశవంతమైన వెలుగును పంచుతున్నాయి. 15 జంక్షన్లు ఉండగా, వాటి వద్ద భారీ పోల్స్ పెట్టి ఎల్ఈడీ వెలుగులు నింపుతారు. పటాన్చెరు జంక్షన్ వద్ద కిలోమీటర్ ముందు నుంచే ఎల్ఈడీ వెలుగులు ప్రారంభమవుతున్నాయి. ఔటర్ రింగురోడ్డుపై 25 కిలోమీటర్ల వరకు ఎల్ఈడీ లైట్లు జిగేల్ మంటున్నాయి.
ముత్తంగికి గర్వకారణం..
ముత్తంగి గ్రామ పరిధిలోంచి ఔటర్ రింగురోడ్డు పోవడంతో మా గ్రామానికి మహర్దశ కల్గింది. పటాన్చెరు రింగురోడ్డు జంక్షన్ కేంద్రం ముత్తంగి గ్రామ పరిధిలో ఏర్పాటు కావడంతో ఐదేండ్ల కాలంలో మా గ్రామ రూపాన్నే మార్చేసింది. అనేక వ్యాపార సంస్థలు, ట్రాన్స్‌పోర్టు సంస్థలు ముత్తంగిలో వ్యాపారాలు చేస్తున్నాయి. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రముఖ రియల్ ఎస్ట్టేట్ సంస్థలు వెంచర్లు, అపార్టుమెంట్లు నిర్మిస్తున్నాయి. ప్రజలకు ప్రయాణం సులభతరమైంది. ఎల్ఈడీ లైట్లతో జంక్షన్ కొత్త కళ వచ్చింది. ఎల్ఈడీ లైట్ల వెలుగులో అద్భుతమైన అభివృద్ధి కనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మా గ్రామాలకు కొత్త భరోసా కల్గిస్తున్నాయి.
-ఉపేందర్ ముదిరాజ్,
ముత్తంగి గ్రామ సర్పంచ్
రోడ్డు నిండా వెలుగులు
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై గురువారం రాత్రి నుంచి ప్రయాణం చేస్తున్నవారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎల్ఈడీ లైట్ల జిగేల్ వాహనదారులు, ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఇనాళ్లు విదేశాల్లో చూస్తున్న సౌకర్యాలు మన వద్ద రావడాన్ని వారు స్వాగతిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రింగురోడ్డుపై ప్రయాణం ఇప్పుడు కొత్త అనుభూతిని పంచుతున్నది.
జిల్లాకు మహర్దశ..
సంగారెడ్డి జిల్లాకు ఔటర్ రింగ్‌రోడ్డు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందింది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా రింగురోడ్డు మారింది. కొత్తగా వేసిన ఎల్ఈడీ లైటింగ్‌తో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఖర్చుకు వెనుకాడకుండా సీఎం కేసీఆర్ ఎల్ఈడీ లైట్లను హెచ్ఎండీఏ ద్వారా ఏర్పాటు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం రిం గురోడ్డును ఆధునీకరిస్తున్నది. జిల్లావాసులతో పాటు పొరుగు రాష్ర్టాలవారు ఈ రింగురోడ్డును వాడుకుని త్వరగా గమ్యస్థానాలకు చేరుతున్నారు. ప్రజల భద్రతతో పాటు నాణ్యమైన రోడ్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం.
-గూడెం మహిపాల్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే
ప్రమాదాలకు చెక్..
రింగురోడ్డుపై ప్రయాణం సులభతరం, వేగవంతం కూడా కావడంతో తరుచూ రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చీకటి ఉండటంతో ఆగిఉన్న వాహనాలను వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనేవి. ఓవర్‌టెక్ చేస్తూ కొన్ని వాహనాలు ఢీకొని ప్రాణాలు పోయాయి. పలువురు వీఐపీలు, వారి పిల్లలు అతివేగంతో ప్రాణాలు కోల్పోయారు. రెండువైపులా నాలుగులైన్ల విశాలమైన్ల రోడ్లు అందుబాటులోకి రావడంతో వాహనదారులు అతివేగంతో ప్రమాదాల బారిన పడ్డారు. ఇప్పుడు 100కిలోమీటర్ల వేగంలోపే ప్రయాణం చేయాలని స్పీడ్ గన్స్‌తో ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. పగటి పూట ట్రాఫిక్ విభాగం చర్యలు తీసుకున్నా, చీకటి పడ్డాక నియంత్రణ లేకుండా పోయింది. ఈ కారణంతో అనేక ప్రమాదాలు జరిగాయి. ప్రాణనష్టాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి ప్రయత్నంలో 25కిలోమీటర్ల దూరం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసి ఓఆర్ఆర్లో వెలుగులు నింపింది. అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో రూ. 100 కోట్లతో మిగిలిన 136 కిలోమీటర్ల దూరం ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. ఈ వెలుగుల కారణంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గనున్నాయి. సుఖ ప్రయాణం సాగనున్నది. గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభించారు.