
సీఎం కేసీఆర్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతున్నది. నడ్డా వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణను, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని అవమానించేలా ఉందని ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి వస్తే కాళేశ్వరం గోదావరి జలాలు, గొంతు తడుపుతున్న మిషన్ భగీరథ నీటిని, జరిగిన అభివృద్ధి చూపిస్తామని వారు అన్నారు. బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు.
అవగాహలేని వ్యాఖ్యలు..
సీఎం కేసీఆర్ నిర్మించిన కాళే శ్వరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగు నీ రందుతున్నది. నడ్డా కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు గుండెల్లో ఉన్నాయి. కాళేళ్వరం ప్రాజెక్టు నుంచి వస్తున్న నీళ్లు బీజేపీ నాయకుల కండ్లకు కనబడడం లేదా. మెదక్ జిల్లా హల్దీ వాగులో ఎండకాలంలో సైతం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సీఎం కేసీఆర్ పారించారు. బీజేపీ కార్యకర్తల పొలాల్లోకి కూడా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి.
గల్లీస్థాయికి దిగజారడం తగదు..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ కిందిస్థాయి నాయకులిచ్చిన స్క్రిఫ్టు చదివి పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు, సంస్థలు ప్రశంసలు కురిపిస్తుంటే, జేపీ నడ్డా మాత్రం ఇక్కడి బీజేపీ నేతలు చేస్తున్న రాజకీయాలను సమర్థ్ధిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో ఏడేండ్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. మిషన్ భగీరథ గురించి పల్లెల్లో ఇంటింటికీ వెళ్లి జనాన్ని అడిగితే చెబుతారు. మిషన్ భగీరథను కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నది వాస్తవం కాదా.
-శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ