సికింద్రాబాద్ : ఓలా కస్టమర్ కేర్ సెంటర్ ఉద్యోగినంటు తనను తాను పరిచయం చేసుకున్న ఓ అగంతకుడు, ఓ ప్రైవేటు ఉద్యోగిని వివరాలను తెలుసుకొని ఆమె బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్ ద్వారా రూ.84,490లను తస్కరించాడు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం సిఖ్విలేజ్కు చెందిన లక్ష్మి సంధ్య (32) ప్రైవేటు ఉద్యోగిని. గత నెల 22వ తేదీన అమె ఓలా ఆటోలో సికింద్రాబాద్ లోని శ్రీ గణేశ దేవాలయానికి వెళ్లింది.
గమ్యస్థానం చేరాక ఆమె సదరు ఆటో డ్రైవరుకు ఆన్లైన్ ద్వారా రూ 82లను చెల్లించింది. గత నెల 29వ తేదీన మరోసారి ఓలా ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించగా ఓలా యాప్లో ఆమె 22వ తేదీన రూ.82లను చెల్లించనట్లుగా తేలింది. దీంతో ఆమె మరో ఆటోలో వెళ్లి పని ముగించుకొని ఇంటికి వచ్చింది. గూగుల్లో లభించిన ఓలా కస్టమర్ కేర్ నెంబరుకు ఫోన్ చేయగా అవతలివైపునుంచి సమాధానం రాలేదు.
ఈ విషయమై ఆమె ఆరాతీస్తుండగా ఓ అగంతకుడు ఫోన్లైన్లోకి వచ్చి తనను తాను ఓలా కస్టమేర్ కేర్ సెంటర్ ఉద్యోగి గా పరిచయం చేసుకున్నాడు. సదరు నెంబరుద్వారా ఆమె మాటలు సరిగా వినిపించడం లేదంటు అతను మరో నెంబరు నుంచి ఆమెకు ఫోన్ చేశాడు. అతడి మాటలను విశ్వసించిన లక్ష్మీసంధ్య తన పూర్తి వివరాలను వెల్లడించింది. చివరిలో అగంతకుడు ఆమె బ్యాంకు డెబిట్ కార్డు ఫోటోతీసి పంపించాలని కోరడంతో అనుమానం వచ్చి ఆమె ఫోన్ను కట్ చేసింది.
అయినప్పటికీ సదరు నెంబరునుంచి పలుమార్లు ఆమెకు ఫోన్ వస్తుండడంతో ఆ నెంబరును బ్లాక్ చేసింది. అనంతరం ఆమెకు వివిధ నెంబర్లనుంచి ఫోన్లు వచ్చినప్పటికీ ఆమె స్పందించలేదు. ఈనెల 3 న తన ఖాతాలోంచి రూ.10వేలు డెబిట్ అయినట్లు ఆమె ఫోన్కు మెసేజ్ వచ్చింది.
అనుమానం వచ్చి ఆమె ఏటీఎం కేంద్రానికి చేరుకునేలోపు వరుసగా రూ.20వేలు, రూ.25 వేలు రూ.10వేలు, రూ.10,390లు, రూ.8,500లు మొత్తం తన ఖాతాలోంచి రూ.84,490లు డెబిట్ అయినట్లు మెసేజ్లు వచ్చాయి. తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.