సంగారెడ్డి డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో చెరువులను చెరబట్టడం కొనసాగూతూనే ఉంది. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో చెరువులు వరుసగా ఆక్రమణకు గురవుతున్నాయి. ఇటీవల అమీన్పూర్ మండలంలోని బంధం కొమ్ము చెరువు, కాల్వలు ఆక్రమణకు గురైనట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) గుర్తించి విచారణకు ఆదేశించింది. సంగారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ విచారణ జరిపి బంధం కొమ్ము చెరువు ఆక్రమణకు గురైనట్లు ఎన్జీటీకి నివేదికను అందజేశారు. ప్రస్తుతం ఎన్జీటీ ఆదేశాల రావాల్సి ఉంది. ఇదిలా ఇలా సాగుతుండగానే పటాన్చెరు నియోజకవర్గంలో తొలి బయోడైవర్సిటీ చెరువుగా పేరొందిన అమీన్పూర్ పెద్ద చెరువు, దానితో పాటు కొత్త చెరువును ఆక్రమణదారులు వదలడం లేదు. ఆక్రమణదారులు చెరువు కట్ట మధ్యలో గుట్టవైపు అడ్డంగా తవ్వేసి ఈ భూమి తమదేనంటూ కట్ట, అలుగుకు మధ్యన ఉన్న ప్రాంతంలో గేటు పెట్టారు. గేటు, ప్రహరీ నిర్మాణాలకు మున్సిపాలిటీ అనుమతులు సైతం లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకుని సర్వే చేసేందుకు ప్రయత్నించగా, ప్రహరీ నిర్మించిన వారు అడ్డుకున్నారు. సర్వే చేయకుండా అడ్డుకోవడంతో పాటు వారితో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కట్టపై నిర్మించిన గేటు, ప్రహరీలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోకి వస్తాయని ప్రాథమికంగా నిర్ధారించుకుని గేటును తొలిగించేందుకు సిద్ధమయ్యారు. అక్కడికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది సైతం ప్రహరీ, గేటు నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అయినా ఇవేమి ఖాతరు చేయకుండా నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులు.. అధికారులకు అడ్డుపడి గొడవకు దిగారు. ప్రస్తుతం నిర్మించిన గేటు, ప్రహరీలు తమ పట్టా స్థలంలోనే ఉన్నాయని, బఫర్, ఎఫ్టీఎల్ జోన్ పరిధిలోకి రావని, ప్రహరీ నిర్మాణానికి మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నామని చెబుతూ, అధికారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ఘర్షణకు దిగారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనల మేరకు సర్వే చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని అక్కడి నుంచి వెనుదిరిగారు.
చెరువు కట్టను తవ్వి, అడ్డంగా గేటు వేసి..
అమీన్పూర్ పెద్ద చెరువు తెలంగాణ తొలి బయోడైవర్సిటీ పరిధిలో ఉంది. దీంతో చెరువును, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్మాణాలు చేపట్టడం బయోడైవర్సిటీ నిబంధనలకు తూట్లు పొడవడమే. ప్రస్తుతం అమీన్పూర్ పెద్ద చెరువు కట్ట మధ్య భాగంలో గుట్ట వద్ద ఆక్రమణదారులు చెరువు కట్టను పూర్తిగా తవ్వేశారు. కొత్త చెరువు, హెచ్ఎంటీ కాలనీలకు వెళ్లే దారికి అడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్లను వేశారు. ఆ తర్వాత గేటును నిర్మించారు. అలుగుకు సమీపంలో చేపలు అమ్ముకునే మత్స్యకారులను అక్కడి నుంచి తరలించేశారు. చెరువు కట్టకు అడ్డంగా గేటు నిర్మాణం చేయడంతో హెచ్ఎంటీ కాలనీలోకి వెళ్లాలనుకునే వాహనదారులు, ఇతరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల అడ్డగింత, వాగ్వాదం..
అమీన్పూర్ పెద్ద చెరువు కట్టపై నిబంధనలు విరుద్ధ్దంగా గేటు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో శనివారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చారు. సర్వే చేసేందుకు సిద్ధం కాగా, నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులు అధికారులను అడ్డుకున్నారు. పట్టా స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నామని అధికారులతో వాగ్వాదానికి దిగారు. బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో పాటు సర్వే నెంబరు 323, 323, 324, 329 లోని భూముల విషయమై కోర్టుల్లో కేసులు ఉన్నాయని, ఇది కోర్టు ధిక్కారణ పరిధిలోకి వస్తుందని ఇరిగేషన్ ఏఈఈ వరప్రసాద్, ఆర్ఐ మల్లేశ్, సర్వేయర్ యాదయ్య తెలిపారు. సర్వే చేసి గేటు తొలిగిస్తామని అధికారులు పట్టుబట్టడంతో వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులు ఘర్షణకు దిగారు. దీంతో చేసేదేమిలేక రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి వెనుదిరిగారు.
చర్యలు తీసుకుంటాం: వరప్రసాద్, ఇరిగేషన్ ఏఈఈ
అమీన్పూర్ పెద్దచెరువు కట్టను అక్రమంగా తవ్వి నిబంధనలకు విరుద్ధంగా గేటును నిర్మించారు. బఫర్‌జోన్ పరిధిలో ప్రహారీలు నిర్మిస్తున్నారు. చెరువు కట్ట తవ్వడం, గేటును అక్రమంగా నిర్మించిన ప్రాంతాలను పరిశీలించాం. ప్రహరీలు నిర్మిస్తున్న ప్రాంతాలను పరిశీలించాం. నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై పోలీసులు ఫిర్యాదు చేయడంతో పాటు సర్వే చేసి అక్రమ నిర్మాణాలను తొలిగిస్తాం.
మా స్థలాల్లోనే నిర్మాణాలు చేపట్టాం..
322, 323, 324, 329 సర్వే నెంబర్లోని భూములు పూర్తిగా పట్టా భూములని, ప్రస్తుతం గేటు నిర్మించిన ప్రాంతంతో పాటు ప్రహరీ కూడా అందులోనే నిర్మాణం చేపట్టినట్లు ఆ స్థలం సంరక్షకుడు రాజుగౌడ్ తెలిపారు. అమీన్పూర్ పెద్దచెరువు కట్టపైన, పక్కన భూములుపై యాజమాన్య హక్కులు ఉన్న వారు నిబంధనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో మండల అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ధారించారని, హెచ్ఎండీఏ అధికారులు సైతం బఫర్‌జోన్ హద్దులు నిర్ధారించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాము చేపట్టిన నిర్మాణాలు బఫర్‌జోన్ పరిధిలోరి రావని తెలిపారు. మున్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాతే నిర్మాణ పనులు చేపట్టామని వివరణ ఇచ్చారు.