స్వచ్ఛత దిశగా అడుగులు
అభివృద్ధి పథంలో గ్రామం
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనం
సకాలంలో పల్లెప్రగతి పనులు పూర్తి
నవీపేట, ఆగస్టు 27: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని మహంతం గ్రామం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పథంలో నడుస్తున్నది. పల్లెప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపడుతున్నారు. వానకాలంలో బురదమయంగా మారే అంతర్గత రోడ్ల ను సీసీరోడ్లుగా మార్చుకున్నారు. రూ.12 లక్షల వ్యయంతో వైకుంఠధామం, రూ.2.50లక్షల వ్యయంతో కంపోస్ట్ షెడ్డు నిర్మించారు.గ్రామంలో ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డు కు తరలిస్తుండడంతో ఊరంతా పరిశుభ్రంగా కనిపిస్తున్నది. మూడేండ్ల క్రితం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషితో మోకన్‌పల్లి నుంచి మహంతం మీదుగా అభంగపట్నం వద్ద బాసర రోడ్డుకు లింకు చేస్తూ రూ.5 కోట్ల వ్యయంతో వేసిన బీటీ డబుల్ రోడ్డు గ్రామానికి కొత్త అందాలను తీసుకువచ్చింది. రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జీపీకి కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్‌తో పారిశుద్ధ్య పనులతోపాటు నాటిన మొక్కలకు నీరు పోస్తూ సంరక్షణకు తోడ్పాటునందిస్తున్నారు. గ్రామంలో 3500 మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు మిషన్ భగీరథ పథకం తోడ్పాటునందిస్తున్నది. గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో పలు రకాల మొక్కలను నాటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేందుకు ట్రాక్ నిర్మించారు. రూ.15 లక్షలతో గ్రామంలో సీసీ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించారు.
గ్రామస్తుల సహకారంతోనే..
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోపాటు గ్రామస్తులు అందిస్తున్న సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా నిర్వహిస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ చొరవ, అధికారుల తోడ్పాటుతో ప్రగతి పనులు సకాలంలో పూర్తి చేశాం. గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అంకిత భావంతో పనిచేస్తున్న.
-మేకల రాజేశ్వర్, సర్పంచ్
గ్రామాభివృద్ధికి కృషి ..
నేను పుట్టి పెరిగిన మహంతం గ్రామాభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నాను. ఎంపీపీ నిధుల నుంచి ప్రత్యేకంగా గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తున్నాను. ఇందుకు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సహకారం అందిస్తున్నారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధుల మంజూరుకు కృషి చేస్తున్నాను.