ఖలీల్‌వాడి, ఆగస్టు 15: కరోనా తగ్గుముఖం పడుతున్నదని ప్రజలు సంతోషిస్తున్న సమయంలోనే డెంగీ రూపంలో మరో ముప్పు పొంచి ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా డెంగీ అనుమానిత కేసులు వస్తుండడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. నివారణ కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. డెంగీ వ్యాధి నిర్ధారణ కాగానే భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ వ్యాధి వచ్చిన వారిలో తెల్ల, ఎర్ర రక్తకణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. సరైన సమయంలో చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
ప్రభుత్వ దవాఖానలో నలుగురు డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. గత పది రోజుల తేడాతో కేసులు పెరుగుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ డెంగీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిసరాల శుభ్రతపై సూచనలు చేస్తున్నారు. డెంగీ వ్యాధికి కారణమయ్యే ఎడిస్ దోమల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. నీటి నిల్వలు, మురికి కుంటలు ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్ వేసి లార్వాలను చంపుతున్నారు.
గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో జ్వరంతో బాధపడుతున్న వారిని వైద్యసిబ్బంది గుర్తిస్తున్నారు. పీహెచ్‌సీల్లో అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి జిల్లా వైద్యశాలకు తరలిస్తున్నారు. అనంతరం ఎలీసా పరీక్షలు నిర్వహించి డెంగీ వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. అదేవిధంగా డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రైవేటు దవాఖానల్లో సైతం అనుమానితులు కనిపిస్తే పీహెచ్‌సీకి వచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు.
వైరల్ ఫీవర్ వచ్చేందుకు ప్రధాన కారణం దోమలు. దోమల నివారణపై శ్రద్ధ పెట్టాలి. ప్లేట్లెట్స్ లక్షా50వేల నుంచి 30వేల వర కు తగ్గినా భయపడాల్సిన అవసరం లేదు. అంతకన్నా తగ్గితే రోగికి ప్లేట్లెట్స్ ఇవ్వా ల్సి ఉంటుంది. గతంలో ప్లేట్లెట్స్ మనకు స్థానికంగా లభ్యమయ్యేవి కావు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ, ప్రభుత్వ జనరల్ దవాఖానలో అందుబాటులో ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-జలగం తిరుపతిరావు, ఎండీ జనరల్ ఫిజీషియన్
డెంగీ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు.