నిజామాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ తీరుపై ఉమ్మడి ని జామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన ఆరోపణలపై గణాంకాలతో తిప్పికొట్టారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీయాలని బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తుందంటూ మొదటి ట్వీట్‌ను మొదలు పెడుతూ… వరుసగా దేశంలో నిరుద్యోగం, తెలంగాణ పథకాలను కాపీ కొట్టిన బీజేపీ తీరును తూర్పారబట్టారు. 2014 నుంచి నేటి వరకు ప్రజల పూర్తిస్థాయి మద్దతు తెలంగాణ రాష్ట్ర సమితికే ఉందంటూ చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కే ప్రజలంతా పట్టం కడుతుంటే 2018 ఎన్నికల్లో 107 స్థానాల్లో డిపాజిట్ దక్కించుకోని పార్టీ మీదేనంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేం ద్రంలో అధికారంలోకి వచ్చాక ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ చెప్పిన మోదీ హామీని కవిత ప్రస్తావించారు. గడిచిన ఎనిమిదేండ్లలో 16కోట్ల ఉద్యోగాల కల్పన ఎక్కడంటూ? కవిత ప్రశ్నించారు. నిరుద్యోగ రేటు గత డిసెంబర్లో 8శాతంగా ఉందని… ఇది బంగ్లాదేశ్, మెక్సికో, వియత్నాం వంటి దేశాల కన్నా ఎక్కువంటూ గణాంకాలను పేర్కొనడంతో బీజేపీ అబద్ధాలన్నీ బట్టబయలయ్యాయి.
సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ దాడి…
అసోం సీఎంపై ఎమ్మెల్సీ కవిత స్పందన ఇలా ఉం ది. బిస్వా శర్మజీ … ఇంతకు ముందు మీ ఉపన్యా సం చూశాను. తెలంగాణ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు. 2014 నుంచి నేటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఇలాగే విర్రవీగుతూ మాట్లాడిన మీ పార్టీ నేతలకు తెలంగాణ ప్రజలు కర్రకాల్చి వాత పెట్టి, 107 స్థానాల్లో డిపాజిట్ లేకుండా చేశారు. కొట్లాడి తె చ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వం లో నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండా. ఆ దిశగా బంగారు తెలంగాణ వైపు పరుగులు పెడుతున్న రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్టుగా కల్పించడం జరిగింది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది ప్రైవేటు ఉద్యోగాలు కల్పించి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
మా పథకాలు కాపీ కొట్టి… మాపైనే విమర్శలా…?
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇప్పటికి ఎనిమిదేండ్లు కావొస్తోంది. మీరు సృష్టించిన 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) సంస్థ లెక్కల ప్రకారం భారత్‌లో నిరుద్యోగిత రేటు డిసెంబర్లో దాదాపు 8శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్ 5.3 శా తం, మెక్సికో 4.7శాతం, వియత్నాం 2.3శాతం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కన్నా భారత్‌లో నిరుద్యోగ రేటు అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా కేసీఆర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతున్నది. రాష్ర్టానికి వచ్చినప్పుడు మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసీఆర్ ఆలోచన నుం చి పుట్టిన రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ నేడు దేశ వ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా అమలు అవుతున్న విషయం మీకు తెలియదా. దయచేసి మరోసారి రాష్ర్టానికి వచ్చేటప్పుడు సరైన హోంవర్క్ చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను అంటూ ముగించారు.
సోషల్ మీడియాలో వైరల్…
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్లు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. బీజేపీ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతూ ఆమె స్పందించిన తీరుపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. అసోం ముఖ్యమంత్రి మాట్లాడిన అబద్ధాలపై కవిత లెక్కలతో సహా వివరించడంతో పాటుగా మోదీ ఇచ్చిన హామీలను ప్రస్తావించడంతో చాలా మంది కి విషయం అవగతమైంది.
అంతేకాకుండా నిరుద్యోగిత రేటులో గత డిసెంబర్లో 8శాతానికి భార త్ చేరుకోవడం, బంగ్లాదేశ్, మెక్సికో, వియత్నాం లాంటి దేశాల కంటే ఘోరంగా మన దేశంలో నిరుద్యోగం పెరగడానికి కారణం ఎవరంటూ కవిత ప్రశ్నించడంతో కమలం పార్టీ నిజస్వరూపం బయట పడింది. నిత్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, మంచిగున్న తెలంగాణలో గొడవలు సృష్టించే విధంగా చేస్తున్న బీజేపీకి కవిత సంధించిన అంశాలతో నోరు మెదపలేని స్థితి ఏర్పడింది.