
రెండు వారాల కిందట వానెప్పుడు పడుతదని ఆకాశం వైపు ఆశగా
ఎదురుచూసిన రైతులు… ఇప్పుడు ఎంత త్వరగా ఆగితే అంత బాగుండని దేవుణ్ని మొక్కుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో వారం రోజుల నుంచి కురుస్తున్న వరుస వర్షాలతో మెట్ట రైతులు తీవ్ర ఆందోళన
చెందుతున్నారు.. పత్తి, కంది, ఇతర ఆరుతడి పంటలు నీరుచిచ్చుతో దెబ్బతింటాయని ఆవేదన చెందుతున్నారు. శనివారం కూడా జిల్లా అంతటా వర్షం కురిసింది. ఉదయం 7 గంటల వరకు నల్లగొండ జిల్లా సగటు వర్షపాతం 8.5మిల్లీ మీటర్లు కాగా, సాయంత్రానికి చాలాచోట్ల దంచికొట్టింది. సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్, రాజాపేట మండలాల్లో
ఎడతెరపి లేకుండా కురిసింది.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : ఎడ తెరిపిలేని వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. శనివారం ఉదయం 7 గంటల వరకు నల్లగొండ జిల్లా సగటు వర్షపాతం 8.5మిల్లీ మీటర్లే కాగా సాయంత్రానికి చాలా చోట్ల భారీ వర్షం పడింది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా ప్రాంతాల వారీగా వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రం ఆరు గంటల వరకు పరిశీలిస్తే.. చండూరులో అత్యధికంగా 57.8మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కనగల్లో 56మి.మీ., నల్లగొండలో 45.8మి.మీ., మునుగోడులో 39.5మి.మీ., దామరచర్లలో 30.3మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా త్రిపురారం, హాలియా, మర్రిగూడెం, నాంపల్లి, నిడ్మనూర్, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల, నకిరేకల్, మిర్యాలగూడ, పెద్దవూర, గుర్రంపోడు, తిరుమలగిరి సాగర్ తదితర మండలాల్లోనూ వర్షం కురిసింది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఎంతో కొంత వర్ష ప్రభావం కనిపించింది. ఇక యాదాద్రి జిల్లాలో అత్యధికంగా ఆలేరు మండలంలోని కొలనుపాకలో 33.5మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మోటకొండూర్లో 32.3మి.మీ., యాదగిరిగుట్టలో 29.8మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా గరిడేపల్లిలో 30.3మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చిలుకూరు, చివ్వెంల, హుజూర్నగర్ మండలాల్లోనూ 3 మిల్లీ మీటర్లకు పైగా వర్షం పడింది. మునుగోడు నియోజకవర్గంలో భారీ వర్షాలకు చెరువులన్నీ అలుగు పోస్తున్నాయి. పలు చెరువులు దశాబ్దాల తర్వాత నిండడం గమనార్హం.
మెట్ట పంటలకు ముప్పు…
ఎడతెరిపిలేని వర్షాలతో మెట్ట పంటలకు ప్రమాదం పొంచి ఉన్నది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో భారీగా పత్తి సాగైంది. ప్రస్తుతం చేలు పూత, కాత దశకు చేరుకున్నాయి. పది రోజుల కిందటి వరకు వర్షం కోసం రైతులు ఎదురుచూశారు. కానీ, వారం రోజులుగా విడవకుండా కురుస్తుండడం ఇబ్బందికరంగా మారింది. చేలల్లో నీరు నిలవడం వల్ల చేలు తెగులు బారిన పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగి తగిన సూచనలు ఇస్తున్నారు. వరుణుడు విరామం ప్రకటిస్తేనే కొంతమేరకైనా రైతులు గట్టెక్కే అవకాశాలున్నాయి.