నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 31: డిచ్పల్లి మండలం బర్ధిపూర్ కెనాల్ వద్ద గురువారం ఉదయం వెలుగుచూసిన హత్య కేసును పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. వ్యక్తిగత గొడవల కారణంతో సమీప బంధువే షేక్ మాజిద్(30)ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు వెల్లడించారు. నగర పరిధిలోని నాగారం గోశాల ప్రాంతంలో నివాసముండే షేక్ మాజిద్‌కు పూలాంగ్ ఏరియాలో ఉండే షేక్ జుబేర్ సమీప బంధువు వీరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతుండడంతో ఆగ్రహం చెందిన జుబేర్.. మాజిద్‌ను హతమార్చేందుకు పథకం రచించాడు. తన స్నేహితుడు షేక్ అతీఖ్ సహకారంతో బుధవారం ఓ ఆటోలో మాజిద్‌ను బర్ధిపూర్ గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ కల్లు సేవించిన అనంతరం గ్రామ శివారుకు వెళ్లి మాజిద్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం డెడ్‌బాడీని కాలువలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం ఉదయం ఘటన వెలుగు చూడడంతో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ రఘునాథ్, డిచ్పల్లి ఎస్సై ఆంజనేయులు వెళ్లి పరిశీలించారు. డాగ్‌స్కాడ్‌తో ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు షేక్ జుబేర్, షేక్ అతీఖ్‌ను అరెస్టు చేసి కత్తి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీపీ వెల్లడించారు. కేసు దర్యాప్తునకు సహకరించిన జక్రాన్‌పల్లి, ఇందల్వాయి ఎస్సైలు ఆసిఫ్, గౌరేందర్తోపాటు సిబ్బంది లింగం, రాజేశ్వర్‌ను సీపీ అభినందించారు. సమావేశంలో అడిషన్ డీసీపీ డాక్టర్ వినీత్, ఏసీపీ వెంకటేశ్వర్లు, డిచ్పల్లి సీఐ రఘునాథ్, ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.