రూ.1100 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు
2వేల పడకల సామర్థ్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
15 ఎకరాల్లో 24 అంతస్తుల్లో నిర్మాణం
నిరుపేదలకు అత్యాధునిక వైద్య సేవలు
సకల హంగులతో కట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
మాట తప్పని, మడమ తిప్పని సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్, డిసెంబరు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక వరంగల్ నగరం అతిపెద్ద హెల్త్ సిటీగా మారే ప్రక్రియ వేగవంతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ ప్రక్రియ స్పీడందుకుంది. ప్రభుత్వ వైద్యశాలల్లో దేశంలోనే అతిపెద్దదిగా నిలిచే ఈ దవాఖాన కోసం రాష్ట్ర సర్కారు శనివారం రూ.1100 కోట్లు మంజూరు చేసింది. 15 ఎకరాల్లో.. 24 అంతస్తులు.. 2వేల పడకల సామర్థ్యంతో.. అత్యాధునిక వసతులు, అన్ని హంగులతో ఈ హాస్పిటల్, ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నిర్మితం కానుంది. అత్యవసర వైద్య సేవలు అందేందుకు ఎయిర్ అంబులెన్స్ (హెలికాప్టర్)ను వినియోగించేలా వైద్యశాల భవనంపై హెలిపాడ్ కూడా రూపుదిద్దుకోనుంది.
నిరుపేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు గాను చారిత్రక వరంగల్‌లో అతిపెద్ద ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే.. ఏడాదిన్నరో దీని నిర్మాణం పూర్తిచేయాలని అనుకున్న మేరకు కార్యచరణను వేగవంతం చేసింది. ఇందుకుగాను శనివారం రూ.1100 కోట్లు మం జూరు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం. రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సివిల్ వర్స్‌కు రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుధ్యం కోసం రూ.20.36కోట్లు, మెకానికల్,ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనులకు రూ.54.28కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18కోట్లకు అనుమతులిచ్చారు. 15 ఎకరాల్లో 24 అంతస్తులతో ఈ హాస్పిటల్ కట్టనున్నారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు. సూపర్ స్పెషాలిటీ నిర్మాణంతోపాటు వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వరంగల్‌లో ఇప్పటికే మెడికల్ కాలేజీ ఉండగా తెలంగాణలో ఏకైక హెల్త్ యూనివర్సిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే ఏర్పా టు చేసింది. హెల్త్ హబ్‌లో భాగంగా 215.35 ఎకరాల్లో అన్ని రకాల వైద్య సేవలు, సౌకర్యాలను కల్పించేలా ఈ ప్రణాళిక ఉంది.
సూపర్ స్పెషాలిటీ భవనంలో 2 వేల పడకలు ఏర్పాటు చేయనున్నారు. స్పెషాలిటీ వైద్య సేవల కోసం 1,200 పడకలను కేటాయించనున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్ విభాగాలు ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం 800 పడకలు కేటాయిస్తారు. అంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలు ఉంటాయి. కిడ్నీ, కాలేయం వంటి అవయవాల మార్పిడి కోసం సౌకర్యాలు ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారు. కీమోథెరపీ, రేడియేషన్ సౌకర్యాలతో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదే ప్రాంగణంలో దంత వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్‌ను రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో నిర్మిస్తున్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం సీఎం కేసీఆర్ జూన్ 21న భూమి పూజ చేశారు. వరంగల్ సెంట్రల్ జైలును తరలించి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని నిర్ణయించి ఈ మేరకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాలమైన స్థలంలో కొత్త వైద్యశాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అత్యవసర వైద్య సేవలకు అనుగుణంగా ఎయిర్ అంబులెన్స్ (హెలికాప్టర్)ను వినియోగించేలా హాస్పిటల్ భవనంపై హెలిపాడ్‌ను ఏర్పాటు చేస్తారు.