కోటగిరి డిసెంబర్ 18: ఉమ్మడి జిల్లాలను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. వరుసగా 15.1, 14.7, 14.1 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట చలి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వాతావరణ విభాగం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. ప్రజలు రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రానున్న ఐదు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉమ్మడి జిల్లాలో కనిష్ఠంగా 11 నుంచి 12 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.