
మెదక్, డిసెంబర్ 22 : మెదక్ జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఇఫ్కో డైరెక్టర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటల్ సమీపంలో నిర్మిస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ముందుగా భవనంలోని అన్ని గదులను కలియ తిరుగుతూ కేంద్రంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి మార్చిలోగా అందుబాటులోకి తీసుకురావాలని సంగారెడ్డి మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవీందర్‌రెడ్డిని ఆదేశించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో రూ.18 కోట్లు ఎంసీహెచ్ భవనానికి మంజూరయ్యాయని, అదనంగా మరో రూ.కోటి 20 లక్షలు రోడ్డు పనులకు మంజూరు కాగా, లైట్ సెంటర్‌కు రూ.70 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఎంసీహెచ్ దవాఖాన పనులను మార్చిలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. ఎంసీహెచ్ (మాతా శిశు సంరక్షణ కేంద్రం) భవనానికి రూ.కోటి 20 లక్షలతో రోడ్డును మంజూరు చేసినట్లు చెప్పారు. సర్వే పనులు పూర్తయ్యాయని, టెండర్లు కూడా పిలిచినట్లు తెలిపారు. ఎంసీహెచ్ దవాఖాన ఎదుట ఉన్న రెండెకరాల భూమిలో పార్కింగ్ చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెదక్ పట్టణంలో ఉన్న దవాఖానను కూడా ఇక్కడికే తరలించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రభుత్వం మెదక్‌కు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డాక్టర్లు సురేందర్, శివదయాల్, సంగారెడ్డి హెల్త్, మెడికల్ ఈఈ రవీందర్‌రెడ్డి, డీఈ విల్సన్, ఏఈ మహేశ్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, అశోక్, శ్రీనివాస్, వెంకన్న ఉన్నారు.