రంగారెడ్డి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలులో కుట్రలు పన్నుతున్న కేంద్ర సర్కారుపై టీఆర్ఎస్ శ్రేణులతో పాటు, రైతులోకం భగ్గుమన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా డప్పుచప్పుళ్లతో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలకు అంతిమ యాత్ర నిర్వహించి ప్రధాన కూడళ్ల వద్ద దహనం చేశారు. ‘రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం డౌన్‌డౌన్.. అన్ని పంటలకు ఎంఎస్పీ చట్టాన్ని అమలు చేయాలి.. గుజరాత్లో ధాన్యాన్ని కొంటరెట్లా.. తెలంగాణ ధాన్యాన్ని కొనరెట్లా ?’ అన్న నినాదాలతో పల్లెలన్నీ హోరెత్తాయి. ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో మరో మాట మాట్లాడే బీజేపీ నాయకులను పల్లెల్లో తిరుగనివ్వబోమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలను నట్టేట ముంచుతున్న కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనగా, కందుకూరు మండలం ఆకులమైలారంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా అంతటా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఊరూరా చావుడప్పు కొట్టి టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో చావుడప్పు కొట్టి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్కడికక్కడ రహదారులపై పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను టీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టమైన హామీనిచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. జిల్లాలోని కందుకూరు మండలం ఆకులమైలారంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాద్‌నగర్‌లో అంజయ్యయాదవ్, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆమనగల్లులో జైపాల్‌యాదవ్, షాబాద్‌లో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెలంగాణపై కక్షగట్టిన కేంద్రం..
తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలంలోని ఆకులమైలారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని, యాసంగిలో వడ్లను కొనుగోలు చేయబోమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించి తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్నదన్నారు. రైతులు యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఇప్పటికే 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉండగా, కేంద్రం మాత్రం ఇప్పటివరకు తీసుకున్నది నామమాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒకలాగా, గల్లీలో మరో విధంగా మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా బీజేపీ నేతలు ఒప్పించాలని, లేదంటే బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా రైతాంగం బుద్ధి చెబుతుందన్నారు. తెలంగాణలో రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ పంట పెట్టుబడి నిమిత్తం ఎకరాకు రూ.10వేలు ఇస్తూ ఏటా రూ.14వేల కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రైతుబంధులో భాగంగా రూ.50వేల కోట్ల రైతుబంధు ద్వారా రైతులకు అందజేశారన్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తూ రైతుకు భరోసాతోపాటు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తూ, నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ పెట్టి రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. దీంతో తెలంగాణ అంతటా నేడు సాగు విస్తీర్ణం పెరిగిందని, గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగా, నేడు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నారన్నారు.
పరిగిలో గాడిదపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ఊరేగింపు
పరిగి, డిసెంబర్ 20 : యాసంగి వడ్లు కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేయడంతో, కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చావుడప్పు కొట్టారు. నల్లబ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని, యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిగిలో వినూత్నంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించడంతోపాటు గాడిదకు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిధిలోని కోట్‌పల్లిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి, వికారాబాద్, మోమిన్‌పేట్‌లలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నవాబుపేట్‌లో ఎమ్మెల్యే కాలె యాదయ్య, కొడంగల్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా కేంద్రంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ జి.నాగేందర్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, పరిగిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.
కేంద్రం తీరు సరికాదు
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీరు సరికాదు. ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనేందుకు రైతులను ఇబ్బందులు గురిచేయడం దారుణం. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కువ రోజులు అధికారంలో ఉండవు, బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే దుస్థితి తప్పదు.
కేంద్రం వడ్ల కొనుగోలు చేపట్టాలి
తెలంగాణలో మంచి వర్షాలు పడడంతో ఎక్కడ చూసినా వడ్ల దిగుబడి బాగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిచ్చేలా కేంద్రం కూడా వడ్లను కొంటే రైతులకు, రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది. రాజకీయాలు చేయకుండా కేంద్రం వడ్ల కొనుగోలుకు వెంటనే ఏర్పాట్లు చేయాలి