
బొమ్మలరామారం, జనవరి 3 : మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు యాంజాల రాజు తనకున్న మూడెకరాల్లో గతంలో వరి సాగు చేసేవాడు. పొలం పనులు కాగానే వ్యాన్ డ్రైవర్‌గా వెళ్లేవాడు. పంట చేతికొచ్చిన తర్వాత చూస్తే పెట్టుబడి పోగా లాభాలు పెద్దగా వచ్చేవి కాదు. డ్రైవింగ్‌లోనూ రాత్రింబవళ్లు పనిచేసినా రూ.15 వేలు మించి వచ్చేది కాదు. ఈ క్రమంలో వరికి బదులుగా ఇతర పంటలపై మక్కువ చూపి ఆకుకూరలు సాగు చేస్తూ నిత్యం ఆదాయం పొందుతున్నాడు. తనకున్న 3 ఎకరాల భూమిలో ఎకరం వరి సాగు, మిగతా 2 ఎకరాల్లో తోటకూర, గోంగూర, కొత్తిమీర, టమాట సాగు చేస్తున్నాడు. ఆదాయం బాగా ఉండటంతో డ్రైవింగ్ మానేసి వ్యవసాయంపైనే దృష్టి పెట్టాడు. ఆకుకూరలు 15 నుంచి 45 రోజుల్లోనే కోతకు వస్తుండడంతో నిత్యం ఆదాయం వస్తుంది. రోజూ తోటకూర 1,000 కట్టలు, కొత్తిమీర 1,200 కట్టలు, గోంగూర 800 కట్టలను హైదరాబాద్‌లోని బోయిన్పల్లి, కుషాయిగూడ, ఉప్పల్ మార్కెట్లతోపాటు స్థానికంగా సంతల్లో చిరు వ్యాపారులకు అమ్ముతున్నాడు. వీటికి ఏడాది పొడవునా గీరాకీ ఉంటుంది. రోజూ 3వేల కట్టలను రూపాయికి ఒకటి చొప్పున అమ్మినా రోజుకు రూ.3వేల ఆదాయం వస్తుంది. ఇందులో కూలీలు, రవాణా, విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందులు, ట్రాక్టర్ ఖర్చులు రూ.30 వేలు పోను నెలకు రూ.60 వేల ఆదాయం పొందుతున్నట్లు తెలిపాడు.
విత్తనాలపై సబ్సిడీ ఇవ్వాలి
విత్తనాలు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఇవ్వాలి. వ్యవసాయశాఖ అధికారులు ఆకుకూరల సాగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాలి. దగ్గరలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే రైతుకు మేలు కలుగుతుంది.
-యాంజాల రాజు, రైతు, రంగాపూర్