e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home ఖమ్మం నో మాస్క్.. హైరిస్క్ !

నో మాస్క్.. హైరిస్క్ !

  • నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం..
  • ఒమిక్రాన్‌ వైరస్‌పై అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • మాస్క్‌లు తప్పనిసరి ధరించాలని నిబంధన
  • అతిక్రమించిన వారికి రూ.వెయ్యి జరిమానా..
  • పరీక్షలు, వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాలని ఆదేశం
  • రంగంలోకి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వైద్యారోగ్యశాఖ

కరోనా కొత్త వేరియంట్‌ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతేకాదు, కరోనా నిబంధనలు కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖానికి ‘మాస్క్‌’ తప్పనిసరిగా ధరించాలని, పెడచెవిన పెట్టిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని ఆదేశించింది. కరోనా కట్టడిలో భాగంగా సీఎం కేసీఆర్‌ మార్గ నిర్దేశంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కరోనా పరీక్షలు ముమ్మరం చేయడంతోపాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. మాస్క్‌ లేకుండా బయట తిరిగేవారికి అపరాధ రుసుం విధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీరితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, ఐసీడీఎస్‌ శాఖలు కొత్త వేరియంట్‌పై విస్తృత ప్రచారం చేయనున్నాయి.

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం సిటీ, డిసెంబర్‌ 2 : కరోనా కొత్త వేరియంట్‌ యావత్‌ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. వ్యాక్సినేషన్‌, కరోనా పరీక్షలతోపాటు స్వీయ జాగ్రత్తల్లో భాగంగా ముఖానికి ‘మాస్క్‌’ ధరించడం తప్పనిసరి చేసింది. పెడచెవిన పెట్టిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒమిక్రాన్‌ విషయంలో అలసత్వం వహిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదా..? తెలంగాణ సర్కారు ముందస్తు వ్యూహం అమలును పరిశీలిస్తే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. డబ్బులే కదా అని మాస్క్‌ ధారణపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే మూల్యం చెల్లించక తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

మాస్క్‌ ధరించని వారికి రూ.వెయ్యి..

కరోనా సెకెండ్‌ వేవ్‌ పూర్తిగా తగ్గనప్పటికీ ఇప్పుడిప్పుడే జనం రోడ్డెక్కుతున్నారు. రోజువారీ పనులపై దృష్టిపెట్టి బతుకు బండిని ముందుకు నడిపిస్తున్నారు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రూపంలో మరోమారు కలకలం రేపుతోంది. మొదటి, రెండు విడతలకు భిన్నమైన స్వభావం కలిగిన వైరస్‌ అని వైద్యనిపుణులు హెచ్చరిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజాగా దేశంలోకి అడుగు పెట్టిందని తెలియగానే తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. స్వీయ జాగ్రత్తలే కీలకంగా పని చేస్తాయని భావించి ముఖానికి మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది. అతిక్రమించిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నేటి నుంచి పోలీసులు రంగంలోకి దిగనున్నారు. మాస్క్‌ లేకుండా ఇంటి నుంచి కాలు బయటపెట్టిన వారికి నిర్బంధ అపరాధ రుసుం విధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. వీరితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, ఐసీడీసీఎస్‌ శాఖలు విస్తృత ప్రచారం చేయనున్నాయి.

అనుమానితులకు కరోనా పరీక్షలు..

కొత్త వేరియంట్‌ సైతం కరోనా వైరస్‌ లాంటిదేనని, స్వీయ జాగ్రత్తలతోపాటు టీకా దానిపై సమర్థవంతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొనడం గమనార్హం. దీంతో ముందుగా చొరవ చూపిన తెలంగాణ ప్రభుత్వం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. జ్వరం, జలుబుతో బాధపడుతున్న వారిని గుర్తించడం, కరోనా పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులకు సేవలు అందించాలనే లక్ష్యాలను నిర్దేశించింది. అదేవిధంగా పద్దెనిమిదేండ్లు నిండిన వారందరికీ టీకాలు తప్పనిసరిగా వేయాలని సూచించింది. సర్కారు ఆదేశానుసారం ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. కేవలం సెకెండ్‌ వేవ్‌ గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో 12,81,993 మందికి కరోనా పరీక్షలు చేశారు. వాటిల్లో ఆర్టీపీసీఆర్‌ 18,667, ఆర్‌ఏటీ 12,63,326 ఉన్నాయి. ఆయా టెస్ట్‌ల ఆధారంగా 65,155 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం 162 మంది పాజిటివ్‌ పేషెంట్స్‌ ఉండగా వైద్యసేవలు అందిస్తున్నారు.

ముమ్మరంగా వ్యాక్సినేషన్‌..

మొదటి, రెండు దశలను దాటుకుని ఇటీవలే ప్రశాంత జీవనంలోకి అడుగు పెడుతున్నామని భావిస్తున్న వారందరికీ ‘ఒమిక్రాన్‌’ వెన్నులో వణుకుపుట్టిస్తున్నది. దాని పంజా నుంచి తప్పించుకోవాలంటే టీకా ఒక్కటే శ్రీరామరక్ష. ఖమ్మం జిల్లాలో నూటికి 95 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. అధికారికంగా అందిన సమాచారం మేరకు ఫస్ట్‌ డోస్‌ 10,13,632 (65శాతం), సెకెండ్‌ డోస్‌ 5,61,282 మందికి ఇచ్చారు. మిగిలిన వారికోసం జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో జల్లెడ పడుతున్నరు. కానీ అపోహలతో వెనుకంజ వేస్తున్నారు. సెకెండ్‌ డోస్‌ తీసుకోవాల్సిన వారు కూడా సహకరించడం లేదు. టీకా కారణంగా ఎలాంటి ప్రమాదం ఉండదని పదేపదే చెబుతున్నా.. పెడచెవిన పెడుతున్నారు.

అప్రమత్తతతే శ్రీరామ రక్ష

ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 3 రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాలకు విస్తరించిందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్‌ 31వ తేదీలోపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాస్కు ధరించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడంతో వైరస్‌ను అరికట్టొచ్చు. ఫంక్షన్లు, పండుగల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ పూర్తిగా కనుమరుగు కాలేదు. వృద్ధులు, ఇతర రోగాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్‌ తీసుకోవడంతో ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు.

భద్రాద్రి జిల్లాలో 90 శాతం వాక్సినేషన్‌

ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యశాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. జిల్లాలో ఇప్పటికే 82 గ్రామాలు వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసింది. మిగతా గ్రామాల్లోనూ 90 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కొంతమందికి రెండో డోస్‌కు సమయం ఉండడంతో వారు మాత్రమే మిగిలి ఉన్నారు.

ఇప్పటి వరకు టీకాలు తీసుకున్న వారి సంఖ్య

భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 18 నుంచి 44 వరకు వయస్సు కలిగిన 4,93,793 మంది పురుషులు, 5,78,568 మంది మహిళలు టీకా తీసుకున్నారు. 45 నుంచి 59వరకు వయస్సు కలిగిన 5,11,659 మంది పురుషులు, 2,88,588 మంది మహిళలు టీకా వేసుకున్నారు. ఇతరులు 207 మంది, 60 వయస్సు కలిగినవారు1,38,503 మంది టీకా తీసుకున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement