దళితుల దశ తిరుగుతున్నది. రెక్కాడితేగానీ డొక్కాడని.. రోజంతా పనిచేసినా కనీసం కూలీ గిట్టని జీవితాలకు బతుకుదెరువు దొరికింది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన చారిత్రక దళిత బంధు పథకం కొత్త వెలుగులు నింపుతున్నది. నిన్నా మొన్నటిదాకా దినసరి వేతనానికి ఒకరి వద్ద పనిచేసిన కూలీలను యజమానులుగా మార్చింది. ఇందుకు హుజూరాబాద్‌లోని పాకాల ప్రమోద్- నాగమణి దంపతుల జీవితమే నిదర్శనంగా నిలుస్తున్నది. మొన్నటిదాకా చాలీచాలని డబ్బులతో కష్టాలు పడ్డ వారిని వీడియో మిక్సింగ్ సెంటర్‌కు ఓనర్‌ను చేసి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. వీరినే కాదు యూనిట్లు పొందిన వేలాది మంది బతుకులు మారుస్తున్నది.
హుజూరాబాద్/ హుజురాబాద్ టౌన్/ వీణవంక, ఏప్రిల్ 17: దళిత బంధు దళితుల దశమార్చింది. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దళితుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. లబ్ధిదారుల అభిరుచికి తగ్గట్టుగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఆటోలు, మినీ వ్యాన్లు, జేసీబీలు అందజేస్తున్నారు. అలాగే పాల వ్యాపారంపై ఆసక్తి ఉన్న వారితో డెయిరీలు పెట్టించారు. ఇంకా టెంట్ హౌస్, వీడియో మిక్సింగ్ షాపు ఇలా అన్నిరంగాల్లో ఉపాధి పొందేలా ఇప్పటికే వేలాది మందికి యూనిట్లు అందజేయగా, పథకం సత్ఫలితాలనిస్తున్నది. అతి తక్కువ టైంలోనే దళితుల జీవితాలనే మార్చివేసింది. వాహనాలు, డెయిరీలు, ఇతర దుకాణాల ద్వారా ఒక్కో కుటుంబం నెలకు 30వేల నుంచి 40వేల పైనే సంపాదిస్తుండగా, కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
దళితబంధు పథకం దిగ్విజయంగా అమలవుతున్నది. అర్హులందరికీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే యూనిట్లు గ్రౌండింగ్ చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మందికి అందజేయగా, మరికొద్దిరోజుల్లో హుజూరాబాద్ సెగ్మెంట్ వందశాతం పూర్తికానున్నది. తాజాగా ఆదివారం హుజూరాబాద్ పట్టణంలో జకె ప్రవళిక -శ్రీనివాస్ ఏర్పాటు చేసుకున్న మెడికల్ ఏజెన్సీ షాపును ఆదివారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. అలాగే జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన జక్కె స్వరూప, రవీందర్‌లకు పీవోపీ యూనిట్ మంజూరుకాగా, యూనిట్‌ను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం ప్రారంభించారు. జమ్మికుంట మండలం గండ్రపల్లికి చెందిన బత్తుల ఎల్లయ్యకు తనుగులలో సిద్ధార్ధ ఐరన్ హర్డవేర్ షాపును ఏర్పాటు చేసుకోగా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జడ్పీటీసీ శ్రీరాంశ్యాం ప్రారంభించారు.
నాకు తొమ్మిదేళ్ల కింద పెళ్లయింది. నా భర్త పిట్ట శ్రీనివాస్. మాకు ఓ పాప, బాబు. నా భర్త పదేళ్లుగా మెడికల్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నడు. నేను ఆసరాగా మెడికల్ షాపులో పనిచేస్తుంటి. నాకు కూడా మెడికల్ ఫీల్డ్‌పై కొంత అవగాహన వచ్చింది. ఏజెన్సీ పెట్టుకుందామని అనుకున్నం. కానీ, అంత డబ్బులు లేక వెనుకడుగు వేసినం. కానీ దళిత బంధు వరంలా వచ్చింది. వచ్చిన డబ్బులతో మెడికల్ ఏజెన్సీ పెట్టుకున్నం. ఈ రోజే ప్రారంభించుకున్నం. చాలా సంతోషంగా ఉంది. ఇక మా దశ తిరిగినట్లే. మెడికల్ బిజినెస్‌తో నేను నాకుటుంబం దర్జాగా బతకడంతోపాటు మరికొందరికీ ఉపాధి కల్పిస్తామనే భరోసా ఉంది. మా కల నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– జకే ప్రవళిక, దళిత బంధు లబ్ధిదారు (హుజూరాబాద్)
హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన పాకాల ప్రమోద్- నాగమణి దంపతులది నిరుపేద కుటుంబం. ప్రమోద్‌కుమార్ చర్చిలో పాస్టర్. వీరికి కూతురు కృపారాణి, కొడుకు సాత్విక్ ఉన్నారు. చాలీచాలని డబ్బులతో ఇబ్బందులు పడ్డారు. వీడియో మిక్సింగ్ షాపు పెట్టుకుందామని ఆశ ఉన్నా చేతిలో చిల్లిగవ్వలేక ప్రమోద్ అలాగే ఉండిపోయాడు. కానీ, కేసీఆర్ తెచ్చిన దళితబంధు తన జీవితానికి కొత్త దారి వేసుకున్నాడు. ఈ పథకం కింద వచ్చిన డబ్బులతో హుజూరాబాద్ పట్టణంలో గాంధీనగర్ రోడ్డులో ‘కృప సాత్విక్’ పేరిట వీడియోగ్రఫీ, వీడియో మిక్సింగ్ డీటీటీపీ తెలుగు, ఇంగ్లిష్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తన భార్య నాగమణితో కలిసి వివాహ రిసెప్షన్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ఎడిటింగ్ చేయడం, సాంగ్స్, పుట్టినరోజు వేడుకలు, వాట్సాప్ స్టేటస్ వీడియోలు, లైవ్ టెలికాస్ట్, వీడియోలు ఎడిటింగ్ చేయడం, యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ఇలాంటి ఎన్నో పనులు చేస్తున్నారు. రోజుకు 2వేలకుపైగా సంపాదిస్తున్నాడు. కాగా, నాగమణి హుజూరాబాద్‌లోని గ్లోబల్ ఇనిస్టిట్యూట్‌లో డీటీటీపీ, వీడియో మిక్సింగ్‌పై శిక్షణ తీసుకుంటూనే తన షాప్‌లో పని కూడా చేసుకుంటున్నది. భార్యభర్తలిద్దరూ ఒకే చోట పనిచేస్తూ ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్నారు.
ఏండ్ల సంది కష్టాలుపడుతున్న. కూలీనాలీ పనికి పోయి భార్యా పిల్లల్ని పోషించుకున్న. నా కష్టాలు తీర్చుమని దేవుళ్లందరికి మొక్కిన. ఏ దేవుడు గూడ నా కష్టాలు తీర్చలేదు. సీఎం కేసీఆర్ సారు మా బతుకులు అర్థం జేసుకున్నడు. మాబోటోళ్ల కోసం దళిత బంధు తెచ్చిండు. 10 లక్షలు ఇత్తండు. నాకు ఇప్పటికే 5 లక్షలు ఇచ్చిండు. నేను డెయిరీ పెట్టుకున్న. నాలుగు బర్లను తెచ్చిన. రోజుకు 20 లీటర్లు ఇత్తనయ్. నెలకు 20వేల వరకు అత్తనయ్. మా బతుకులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నయ్. దేవుడు గూడ జేయని సాయం సీఎం కేసీఆర్ సారు జేసిండు. ఆ సారును బతికున్నంతకాలం మర్చిపోం.
– పర్లపెల్లి కనుకయ్య, లబ్ధిదారుడు, కనపర్తి (వీణవంక)
మాది హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట. మాకు ఇద్దరు పిల్లలు. నా భర్త చర్చిలో పాస్టర్‌గా పనిచేసేది. చాలీచాలని డబ్బులతో ఇబ్బందిపడ్డం. ఇంకేదైనా వ్యాపారం చేద్దామన్నా.. పైసల్లేక ఆగిపోయినం. ఇక ఇంతేనా అని అనుకున్నం. కానీ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చి భరోసా నింపిండు. యూనిట్ కింద హుజూరాబాద్ గాంధీనగర్‌లో వీడియో మిక్సింగ్ సెంటర్ పెట్టుకున్నం. మరో వ్యక్తిని షాపులో పెట్టుకోకుండా మేమిద్దరం కలిసి పనిచేస్తూ రోజూ రూ.2 వేల నుంచి రూ.2500 దాకా సంపాదిస్తున్నం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు. మా పిల్లలిద్దరినీ బాగా చదివించుకుంటున్నం. సీఎం కేసీఆర్‌తోనే మా జీవితం నిలబడ్డది. రుణపడి ఉంటం.