నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -20, 21 పనులతోపాటు నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ అధికారులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. మంచిప్ప రిజర్వాయర్ కింద ముంపు భూముల నిర్వాసితులకు అవసరమైతే సీఎం కేసీఆర్‌ను కలిసి పరిహారం అందించేలా చూస్తానని తెలిపారు.
నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 23 : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించడానికి ప్యాకేజీ- 20, 21 కింద చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో సీఈ మధుసూదన్‌రావు, ఎస్ఈ కరుణాకర్, ఈఈ అశోక్‌కుమార్, డీఈ, ఏఈలతో గురువారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -20, 21 పనులతోపాటు నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులపై సమీక్షించారు. పైపులైన్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల అభ్యంతరంతో అక్కడక్కడ నిలిచిపోయిన పైపులైన్ పనులను కూడా పూర్తి చేయాలన్నారు. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిచేందుకు చేపడుతున్న పైప్‌లైన్ పనులకు రైతులు సహకరించాలని కోరారు. మంచిప్ప వద్ద 3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ కింద తొమ్మిది గ్రామాలకు చెందిన 1,300 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయని, అవసరమైతే సీఎం కేసీఆర్‌ను కలిసి భూనిర్వాసితులకు లబ్ధి చేకూరేలా పరిహారం అందేలా చూస్తానని అన్నారు.
ఇందల్వాయి మండలంలోని చాంద్రాయన్‌పల్లి, త్రయంబక్‌పేట్, ఇందల్వాయి మూడు గ్రామాల శివార్లలో ఉన్న 2,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాకు మంచిప్ప రిజర్వాయర్ ద్వారా సాగునీటిని అందించే ప్యాకేజీ- 22 ద్వారా ఇందల్వాయి చెరువులో తూము ఏర్పాటు చేసి ఇందల్వాయితోపాటు మిగతా రెండు గ్రామాలకు కూడా సాగునీరు అందేలా చూడాలని కామారెడ్డి ఇరిగేషన్ ఏఈకి ఫోన్ ద్వారా సూచించారు. సారంగాపూర్ వద్ద ప్యాకేజీ- 20 కింద చేపడుతున్న పంపుహౌస్ నిర్మాణ పనులపై కూడా చర్చించారు. మెంట్రాజ్‌పల్లి వద్ద నిర్మించిన పంపుహౌస్ ద్వారా జక్రాన్‌పల్లి మండలంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అవసరమైన అన్ని పనులు పూర్తయిన నేపథ్యంలో వెంటనే వెట్న్ ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో డీఈలు బాల్‌రాజ్, సుచరిత, గంగాధర్, ప్రేమ్‌కుమార్, ఆయా మండలాల ఏఈలు పాల్గొన్నారు.