జమ్మికుంట రూరల్, డిసెంబర్ 28: రైతులు యాసంగి సీజన్లో ఆరుతడి పంటలు సాగు చేసుకోవడమే మేలని ఏఈవో గట్టు తిరుపతి సూచించారు. వ్యవసాయ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఏఈవో మంగళవారం మండల పరిధిలోని తనుగుల గ్రామంలో పంటల వివరాలు నమోదు చేశారు. ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుకు చేయూత కోసం రాష్ట్ర ప్రభుత్వం పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. ఇప్పటి వరకు క్లస్టర్ పరిధిలో 240 ఎకరాల్లో సాగవుతున్న పంటల వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని, ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే అధిక దిగుబడితోపాటు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు.
ఇల్లందకుంట, డిసెంబర్ 28: రైతులు యాసంగిలో సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో మౌనిక సూచించారు. మంగళవారం మర్రివాణిపల్లి, బోగంపాడు గ్రామాలను సందర్శించారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రైతులు పంటలు సాగు చేసుకునేముందు వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.