
ప్రతి పోలీస్ స్టేషన్ వారీగా టెక్నాలజీపై సిబ్బందికి శిక్షణ బాధితులకు అందుబాటులో డయల్ 100 గతేడాది ఉమ్మడి జిల్లాలో పలు కేసులు నమోదు పిల్లలని ఉండదు, మహిళలు అని చూడరు. వయస్సుకైనా కనీస గౌరవం ఇవ్వరు. విచక్షణ అన్నదే వాళ్ల వారి అకౌంట్లో కనపడదు. తెలిసిందల్లా ఒక్కటే! ఒక వాస్తవాన్ని సమాధి చెయ్యడం కోసం వెయ్యి అబద్ధా లైనా ఆడడం. లక్ష కూతలు కూసైనా విద్వేషాలను రెచ్చగొట్టాలనే నైజం. ఇదంతా కుట్రపూరితం. సభ్యత ఉండదు. సంస్కారమూ అడ్డురాదు. పిచ్చి రాతలు, బాధ్యతలేని పోస్టులు, మార్ఫింగ్‌లు, మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఇదీ సోషల్ మీడియాలో పనిగట్టుకొని చేస్తున్న కొందరి నిర్వాకం భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో పెట్రేగిపోతున్న చీడ పురుగులను సామాన్యులు సైతం ఛీకొడుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని కాంక్షిస్తూ బాధ్యతగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం, ఫేక్ వీడియోలు వైరల్ చేయడం, మార్ఫింగ్‌లకు పాల్పడుతుండడంపై పోలీస్ శాఖ సైతం ఉక్కుపాదం మోపుతున్నది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే జైలు తప్పదని హెచ్చరిస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, జనవరి7 (నమస్తే తెలంగాణ) : చేతిలో ఫోన్ ఉందని ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్ లేదా వాట్సాప్ అకౌంట్లలో ఏది పడితే అది పోస్ట్ చేస్తే కటకటాలు తప్పవు. చట్టాలను సైతం బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతున్నది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే ఇక నుంచి కేసులు నమోదు చేసి జైలుకు పంపనుంది. ఇప్పటికే బహుళ సేవలు అందిస్తున్న డయల్ 100ను సోషల్ మీడియా బాధితులు వినియోగించుకోవాలని పోలీసు శాఖ సూచిస్తున్నది. గతేడాదిలో ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కేసులు నమోదు చేశారు. ఇక నుంచి మరింత కఠినంగా వ్యవహరించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
నిరంతర నిఘా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వ్యవహరించే వారిపై పోలీస్ శాఖ ఇకనుంచి కఠినంగా వ్యవహరించనున్నది. ఇప్పటికే జిల్లా పోలీస్ కార్యాలయాల్లో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ప్రత్యేకంగా పని చేస్తున్నది. ఇందులో టెక్నాలజీపరంగా నిపుణులైన సిబ్బందితో నిరంతరం సోషల్ మీడియా పోస్టులు గమనిస్తున్నారు. ఇక ముందు వీరు మరింత క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. ఇదే రకమైన నిఘాను ప్రతీ పోలీస్‌స్టేషన్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా పోలీస్స్టేషన్ల వారీగా టెక్నాలజీపరంగా అవగాహన ఉన్న వారిని గుర్తించి వారికి జిల్లా మానిటరింగ్ సెల్ విభాగం నుంచి సోషల్ మీడియా కంటెంట్‌పై ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు. వీరు ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులు, కామెంట్స్, వివిధ వాట్సాప్ గ్రూప్స్, యూట్యూబ్ ఛానళ్లల్లో వస్తున్న సబ్జెక్టులపై ఎప్పటికప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. సీఎం కేసీఆర్‌తో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు, ఇతర ప్రముఖులు, సామాన్యులనైనా సరే కించపరిచేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా పోస్టులు వైరల్ చేసినా కఠినంగా వ్యవహరించనున్నారు.
కఠిన చర్యలకు సిఫార్సులు
సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన పోస్టుల విషయంలో కేటగిరిల వారీగా వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. ఇంటర్నెట్ ద్వారా తప్పుడు సమాచారంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఐపీసీ సెక్షన్ 182కింద, మతం, జాతి, కులం ఆధారంగా కించపరిస్తే సెక్షన్153ఏతో, వ్యక్తిగత విషయాల్లో ఫేక్‌న్యూస్ క్రియేట్ చేస్తే సెక్షన్ 336, శాంతియుత వాతావరణానికి ఇబ్బంది కలిగేలా తప్పుడు సమాచారం సృష్టిస్తే సెక్షన్ 505, అజ్ఞాతంగా ఉంటూ సోషల్‌మీడియా ద్వారా వేధిస్తే లేదా ఉద్దేశ పూర్వకంగా బదనాం చేస్తే సెక్షన్ 507, సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధిస్తే సెక్షన్ 354డి(స్టాకింగ్), కరోనాపై తప్పుడు సమాచారంతో భయబ్రాంతులకు గురిచేస్తే ఎపిడమిక్ డీసీజెస్ యాక్టు 1897, తదితర సెక్షన్లతో కేసులు నమోదు చేయనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సెక్షన్లతో కేసులు నమోదైతే 6నెలల నుంచి మూడేండ్ల వరకు జైలుశిక్షకు ఆస్కారం ఉంది.
పలుచోట్ల కేసులు నమోదు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలోనే సోషల్ మీడియా వేదికగా పరువు,ప్రతిష్ఠలకు భంగం కలిగించిన వారిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. వీటి ద్వారా పలువురు కటకటాల పాలయ్యారు. పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐదుచోట్ల కేసులు నమోదయ్యాయి.
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పీఎస్‌లో ఐదుగురిపై కేసు నమోదైంది. సీఎం కేసీఆర్‌తో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ భిక్షాన్ని కించపరిచేలా శ్రీనునాయక్ వీడియో సృష్టించి సోషల్‌మీడియాలో వైరల్ చేశాడు. స్థానిక ఎంపీపీ ఫిర్యాదు మేరకు శ్రీనునాయక్‌తో పాటు ఆ పోస్టును సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన మరో నలుగురిపై కేసు నమోదైంది.
ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ను దూషిస్తూ సోషల్‌మీడియాలో చేసిన పోస్టుపై అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
గతేడాది జనవరి 29న మంత్రి జగదీశ్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ నల్లగొండ టూటౌన్ పీఎస్‌లో టీఆర్ఎస్వీ నేత బొమ్మరబోయిన నాగార్జున చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మార్చి 26న నల్లగొండకు చెందిన ప్రముఖ అడ్వకేట్ పరువుకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న ఆరోపణపై ఇద్దరిపై కేసు నమోదైంది.
మార్చి27న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో అగౌరవపరుస్తున్నారని ఫిర్యాదుతో కంపాసాగర్‌కు చెందిన కొండ భాస్కర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.