బంజారాహిల్స్ : కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 37 ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
వారంరోజులుగా ఆయా పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు నడుస్తుండడంతో సిబ్బంది స్కూళ్లకు వస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లను పూర్తిస్థాయిలో తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా కరోనా ముప్పు ఇంకా తొలగిపోనందున కోవిడ్ నిభందనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పాఠశాలల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు అన్ని తరగతి గదుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో శానిటైజేషన్ పనులు చేపట్టారు.
స్కూల్కు వచ్చే విద్యార్థులు ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చూడాలని, శానిటైజర్లను వాడడంతో పాటు బౌతిక దూరం పాటించేలా చూడాలని విద్యాశాఖ జారీ చేసిన నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసారు.