నిజామాబాద్ రూరల్, జనవరి 2 : కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఉపసర్పంచ్, పలువురు వార్డ్డు సభ్యులు రాజకీయ కక్షతో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండలంలోని కొత్తపేట సర్పంచ్ లావణ్య ఆరోపించారు. పల్లెప్రగతి పనులకు సంబంధించి ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులు ఎంబీ రికార్డు చేసినప్పటికీ ఉపసర్పంచ్ చెక్కులపై సంతకం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ లావణ్య ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఉపసర్పంచ్, వార్డుమెంబర్లు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఇప్పటికే కలెక్టర్‌తోపాటు డీపీవో, డీఎల్పీవోకు పలుమార్లు విన్నవించినట్లు తెలిపారు.
విపక్షాలకు చెందిన ఉపసర్పంచ్, వార్డుసభ్యుల వ్యవహారశైలికారణంగా ఇప్పటికే ముగ్గురు గ్రామపంచాయతీ కార్యదర్శులు బదిలీ చేయించుకొని వెళ్లిపోయారన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పలు పనులు చేపట్టడంతోపాటు పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, సీసీ కెమెరాలు, సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు తదితర పనులు చేపట్టినట్లు తెలిపారు. బిల్లులకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచ్ సంతకం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
అభివృద్ధికి అడ్డుపడుతున్న ఉపసర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేయాలని, ఈ విషయాన్ని మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపసర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేయాలని ఆమె కోరారు.