పంటలు పండించే విషయంలో మూస పద్ధతిలో ఒకే పంటను నమ్ముకొని నష్టపోవడం కన్నా.. ఆలోచించి లాభదాయకమైన సాగు చేస్తే ఆ రైతు ఇంట సిరులు కురుస్తాయి. నేల స్వభావం ఏదైనా సరే తన ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుంటే తిరుగుండదు. పట్టుదలతో విభిన్న రకాల సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కామారెడ్డి జిల్లాలోని పలువురు రైతులు. ఒక్కో రైతు ఒక్కో రకమైన పంటను సాగు చేస్తూ స్ఫూర్తిని చాటాతున్నారు.
బిచ్కుంద/ఎల్లారెడ్డి, డిసెంబర్ 22: సాగునీరు అందుబాటులో ఉందని వరి పంటే ఎప్పటికీ పండిస్తామనుకోవడం సరికాదు. భూసారం తగ్గి, పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఈ విషయమై సుదీర్ఘంగా ఆలోచించిన కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు రైతులు తీరొక్క పంటలను పండిస్తున్నారు. యాసంగిలో ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుండడంతో ఇతర పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించారు. ఇదే సమయంలో అందరూ ఒకే రకమైన పంటలు పండించకుండా విభిన్న రకాలను సాగు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
బోరుబావుల వద్ద ఎర్ర బంగారం..
బిచ్కుంద మండలం పెద్ద దేవాడ గ్రామంలోని పలువురు రైతులు బోరుబావుల వద్ద ఎర్ర బంగారం (మిర్చి) పంటను సాగు చేస్తున్నారు. వానకాలంలో వేసిన పెసర పంటను కోసిన అనంతరం యాసంగిలో మిర్చి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర నుంచి మిర్చి నారు కొనుగోలు చేసి నాటుతున్నారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసే మిర్చి పంటకు కొనుగోలు సమయంలో అధిక డిమాండ్ ఉంటుందని రైతులు చెబుతున్నారు. హైబ్రీడ్ రకం మిర్చి సాగు చేస్తే పెట్టుబడి తగ్గుతుందని వివరిస్తున్నారు.
మిర్చితో అధిక లాభాలు..
నాకున్న ఎకరం మెట్ట భూమిలో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నా.. వానకాలంలో పెసర, యాసంగిలో మిర్చి సాగు చేస్తున్నా.. వానకాలంలో వేసిన పెసర పంట 50 రోజుల్లో కోతకు వస్తుంది. అనంతరం దుక్కి దున్ని, నీరు పెట్టి మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన మిర్చి నారును నాటాను. వరి కన్నా మిర్చి పంట అధిక లాభాలను ఇస్తుంది.
బంతితో భలే ఆదాయం..
బిచ్కుంద మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన రైతులు బంతిపూలను పండిస్తూ భలే ఆదాయం పొందుతున్నారు. వరి కోతలు పూర్తి కాగానే దుక్కులు దున్నిన రైతులు, యాసంగిలో బంతి పూలను సాగు చేస్తున్నారు. ఈ పంట సాగు కు తక్కువ పెట్టుబడి అవసరమవుతుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. బంతి నాటు వేసిన తర్వాత కేవలం 30రోజుల్లోపు పూలు కాస్తాయి. మార్కెట్లో బంతి పూల ధర కిలోకు రూ.100 ఉండడంతో ఆదాయం బాగా వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
నా పేరు శ్రీనివాస్. మాది బిచ్కుంద మండలం గోపన్పల్లి గ్రామం. కేవలం రెండు గుంటల భూమిలో బంతి పూలు పండిస్తున్నాను. ఈ పంటకు పురుగుల బెడద ఉండదు. రసాయన మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాను. సుమారు పదివేల రూపాయల వరకు లాభం వస్తుంది.
ఎల్లారెడ్డిలో బొప్పాయి..
సాగు నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి పండించడం కన్నా వాణిజ్య పంటలు సాగు చేయడమే మేలని ఎలారెడ్డికి చెందిన పలువురు రైతులు అంటున్నారు. ఇప్పటి వరకు వరి మాత్రమే సాగు చేసిన గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ఆరుతడి పంటలపై కలిగిన అవగాహనతో రైతులు క్రమేపీ ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. పోచారం ప్రాజెక్టు ఆయకట్టులో దశాబ్దాలుగా వరి పంటను మాత్రమే సాగు చేసిన రైతులు ఇప్పుడు వాణిజ్య పంటలను పండిస్తున్నారు. వానకాలంలో సాగు చేసిన బొప్పాయితో ఎకరానికి రూ.లక్షకు పైగా లాభం పొందారు. నాణ్యమైన బొప్పాయి ధర మార్కెట్లో కిలోకి రూ.40 ఉండగా రైతుకు పది నుంచి పదిహేను రూపాయలు వచ్చినా ఎకరానికి ఏడాదికి రెండు లక్షలకుపైగా లాభం వస్తుంది. మహారాష్ట్ర నుంచి తెచ్చే బొప్పాయి మొక్కకు రూ.15 ఖర్చు అవుతుంది. ఎకరానికి వెయ్యి మొక్కలు నాటేందుకు రూ.10వేలు, ఇతరత్రా పనులకు మరో రూ.20వేలకు మించి ఖర్చు ఉండదు.
రెండు ఎకరాల్లో వేశా.. రెండు లక్షలు వచ్చాయి..
అల్లం సాగులో అంతర పంటగా బొప్పాయి వేశాను. రూ.30వేలు పెట్టి రెండు వేల మొక్కలను నాటాను. నీరు ఎక్కువై వెయ్యి మొక్కలు చనిపోగా మిగిలిన వెయ్యి మొక్కలకు అయిన పండ్లతో రెండు లక్షల రూపాయలు సంపాదించాను. కనీసం ఐదు ఎకరాల విస్తీర్ణంలో పంట వేసి, బొప్పాయిని హైదరాబాద్కు తరలిస్తే మరింత లాభం వస్తుంది.
మంచి లాభాలు వస్తాయి..
ఎకరం భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నాను. సుమారు రూ.30వేల పె ట్టుబడి పెడితే రూ.50 వేల వరకు లాభం వస్తుం ది. పత్తి పంటకు తక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
వంద ఎకరాల్లో సాగు..
బిచ్కుంద మండలంలో సుమారు 100 ఎకరాల మెట్ట భూముల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తుండడంతో రైతులు పత్తి పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు యాసంగిలో ఇతర పంటలు సాగు చేసుకుంటే బాగుంటుంది.