భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 31 : రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ, పశు పోషణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా పశు సంపదకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమగ్ర చర్యలు చేపడుతుంది. ప్రతి గ్రామానికి ఒక పశుమిత్రను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తి గల మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలిని ఎంపిక చేసి వెటర్నరీ యూనివర్సిటీలో నెల రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్లో 45మందికి అవకాశం కల్పించి, ప్రతి 15రోజులకోసారి పరీక్షల నిర్వహిస్తారు. అనంతరం వారి సొంత మండలంలో రెండు నెలల పాటు పశు వైద్యాధికారి వద్ద శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు చివరిగా యూనివర్సిటీలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తారు. అనంతరం వారి గ్రామంలో పశువుల ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించాల్సి ఉంటుంది.
పశుమిత్రల విధులు…
ఎంపిక కాబడిన పశుమిత్రలు ఆయా గ్రామాల్లో పశువులకు ఎదురయ్యే ప్రాథమిక సమస్యలకు పశు వైద్యాధికారుల సలహాలు, సూచనల మేరకు చికిత్స నిర్వహిస్తారు. పాడి రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ పశుసంపద, పాడి అభివృద్ధికి దోహదపడనున్నారు.