వేల్పూర్, జనవరి 6: తమ స్నే హితులను కలుసుకోవాలని వెళ్తున్న ఇద్దరు మిత్రులను రోడ్డు ప్రమా దం బలితీసుకున్నది. మం డలంలోని లక్కోర గ్రామశివారులో గురువారం కారును బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందా రు. వీరిద్దరూ ఇంటికి ఒక్కగానొక్క కొడుకులు కావడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషా దం నెలకొంది. జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన బురుగు శివకుమార్ (21), బొజ్జ అన్వేష్(22) కమ్మర్‌పల్లిలో ఉంటున్న స్నేహితులను కలుసుకోవడానికి బైక్‌పై గురువారం బయల్దేరారు. మార్గమధ్యంలో వేల్పూర్ మండలం లక్కోర గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొట్టారు. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతదేహాలను ఆర్మూ ర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తొర్లికొండలో విషాదఛాయలు
జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండకు చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్‌గౌడ్-శ్యామల దంపతులకు కొడుకు శివకుమార్, కూతురు ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి గీత కార్మికుడు కాగా, చేతికి వచ్చిన కుమారుడు లేడన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అదే గ్రామానికి చెందిన రాజు-లక్ష్మి దంపతులు కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు బొజ్జ అన్వేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు తమ మిత్రులను కలువడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.