
చేగుంట, డిసెంబర్ 20 : తమ్ముడిని, అతడి స్నేహితుడిని పాఠశాలలో దించేందుకు బైక్‌పై తీసుకువెళ్తుండగా మృత్యువు రూపంలో వచ్చిన లారీ అన్నతో సహా ముగ్గురినీ కబళించింది. కొద్ది సేపట్లో స్కూల్‌కు చేరుతామనుకునే లోగా జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలకు తీరని వేదన మిగిల్చింది. ఇప్పటికే భర్తలను కోల్పోయి అష్టకష్టాలు పడుతూ కుటుంబాలను పోషిస్తున్న తల్లులు ఇప్పుడు కడుపుకోతకు గురవడంతో వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. చేగుంట మండలం అనంత్‌సాగర్ గ్రామ పరిసరాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలం ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పల్లె ప్రదీప్(17), పండ్ల అరవింద్ (15) మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పది, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కాగా, సోమవారం తమ్ముడు పల్లె ప్రదీప్, అతడి స్నేహితుడు పండ్ల అరవింద్‌ను పాఠశాలలో దించేందుకు అన్న పల్లె రాకేశ్ ద్విచక్రవాహనంపై ముగ్గురు కలిసి బయలుదేరారు. అనంత్‌సాగర్ గ్రామ పరిసరాల్లోకి రాగానే ఎదురుగా వచ్చిన జీలిక పరిశ్రమకు చెందిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో పల్లె రాకేశ్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా, తీవ్రగాయాలై కొన ఊపిరితో ఉన్న మిగతా ఇద్దరినీ చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. కాగా, పల్లె రాకేశ్, ప్రదీప్ తండ్రి సాయిలు గతంలోనే మృతిచెందగా, తల్లి చంద్రకళ వెన్‌కాబ్ పరిశ్రమలో కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అలాగే, పండ్ల అరవింద్ తండ్రి అశోక్ కూడా గతంలోనే మృతిచెందగా, తల్లి పెంటమ్మ వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు.
విషాదఛాయలు.. ఆందోళన
ఒకే రోజు.. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే భర్తలు మృతి చెంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషిస్తున్న తల్లులు రోడ్డు ప్రమాదంలో తమ బిడ్డలు మృతిచెందారని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. కొడుకులు మంచిగా చదువుకుని విద్యావంతులై తమకు అండగా నిలబడతారనుకుంటే ఇలా అకాలమరణం చెందారని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, ప్రమాదం జరిగిన జీలిక పరిశ్రమ వద్ద మృతుల బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా, మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై సుభాశ్‌గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం రామాయంపేట ప్రభుత్వ దావఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.