e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home జిల్లాలు రోడ్ల విస్తరణతో మారిపోతున్న గజ్వేల్‌ రూపురేఖలు

రోడ్ల విస్తరణతో మారిపోతున్న గజ్వేల్‌ రూపురేఖలు

  • ప్రధాన రహదారితో పాటు పూర్తయిన నాలుగు మార్గాలు
  • కోటమైసమ్మ మార్గంలో రూ. 12.50 కోట్ల బడ్జెట్‌తో 1300 మీటర్ల మేర పనులు
  • క్యాసారం గ్రామానికి డబుల్‌ రోడ్డు
  • రూ. 10.50 కోట్లతో కొనసాగుతున్న నిర్మాణ పనులు

గజ్వేల్‌, నవంబర్‌ 29: రహదారుల విస్తరణతో గజ్వేల్‌ రూపురేఖలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పట్టణంలోని రహదారులను అధికారులు శరవేగంగా వెడల్పు చేస్తున్నారు. రూ. 12.50 కోట్లతో ఇందిరాపార్కు నుంచి పాత పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వరకు 1300మీటర్ల దూరం నాలుగు లైన్ల మార్గాన్ని నిర్మిస్తున్నారు. మహంకాళీ ఆలయం నుంచి క్యాసారం గ్రామం వరకు రూ.10.50కోట్లతో 3.5కిలోమీటర్ల రెండు లైన్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే, గజ్వేల్‌ -ప్రజ్ఞాపూర్‌ మార్గం ప్రజ్ఞాపూర్‌ నుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు ఆరు లైన్లు రోడ్డు ఇప్పటికే పూర్తయ్యింది. డివైడర్లు, బట్టర్‌ఫ్లై లైట్లు, వివిధ రకాల చెట్లతో రహదారులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాగా, ఇన్నాళ్లూ ఇరుకు రోడ్లు, అస్తవ్యస్త ట్రాఫిక్‌ వ్యవస్థతో ఇబ్బందులు పడ్డ తమకు త్వరలో ఊరట లభిస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాజమార్గాల నిర్మాణంతో గజ్వేల్‌ పట్టణం మరింత అందంగా, సౌకర్యవంతంగా మారుతున్నది. 2014 ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ అభివృద్ధి ప్రత్యేక దృష్టిసారించి పట్టణంలోని అన్ని రహదారులను వెడల్పు చేయాలని నిర్ణయించారు. దీంతో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రోడ్డు ప్రజ్ఞాపూర్‌ నుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు ఆరు లేన్ల రహదారిగా నిర్మించారు. డివైడర్లు, బట్టర్‌ఫ్లై లైట్లు, వివిధ రకాల చెట్లతో ఈ రోడ్డును అందంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ముట్రాజ్‌పల్లి రింగురోడ్డు వరకు, వివేకానంద చౌరస్తా నుంచి ఎస్సీ కాలనీ మీదుగా వాగుగడ్డ హనుమాన్‌ దేవాలయం వద్ద ఉన్న రింగురోడ్డు వరకు, గజ్వేల్‌లోని ఇందిరాపార్కు నుంచి సంగాపూర్‌ వరకు నాలుగు లేన్ల మార్గాన్ని డివైడర్లు, చెట్లు, బట్టర్‌ఫ్లై లైట్లతో ఏర్పాటు చేశారు.

- Advertisement -

దశాబ్దాల సమస్యకు పరిష్కారం..
గజ్వేల్‌ పట్టణంలోని ఇందిరాపార్కు నుంచి కోటమైసమ్మ వరకు ఉన్న మార్గం చాలా ఇరుకుగా ఉండి ఆర్టీసీ బస్సుతో పాటు సామాన్య ప్రజల ప్రయాణానికి ఇబ్బందిగా ఉండేది. ఇదే మార్గంలో పాండవుల చెరువు కూడా ఉండడంతో బతుకమ్మ సంబురాల సమయంలో చాలా ఇబ్బందులు ఏర్పడేవి. దీంతో ఈ రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. రూ.12.50 కోట్లతో ప్రధాన రహదారిపై ఉన్న ఇందిరాపార్కు నుంచి పాత పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వరకు 1300 మీటర్ల దూరం నాలుగు లేన్ల మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 400ల మీటర్లు పూర్తి కాగా, ఫుట్‌పాత్‌లు, బట్టర్‌ఫ్లై లైట్లు, డివైడర్లు డ్రెయిన్‌ల నిర్మాణం జరిగింది. మిగిలిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి అడ్డుగా ఉన్న భవనాలను వేగంగా తొలిగిస్తున్నారు. కూల్చివేతలు పూర్తి కాగానే మిగిలిన 900ల మీటర్ల రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక, ఇందిరాపార్కు నుంచి ఢిల్లీ వాలా హోటల్‌ వరకు నాలుగు సంవత్సరాల క్రితమే నిర్మాణం పూర్తయ్యింది.

క్యాసారం గ్రామానికి డబుల్‌ రోడ్డు..
గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో విలీనం కావడంతో క్యాసారం గ్రామం అద్భుతంగా మారుతుంది. ఇప్పటికే గ్రామంలోని భూములకు గజ్వేల్‌ పట్టణం స్థాయిలో విలువ పెరిగింది. కానీ, గ్రామ రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా మారడంతో స్థానిక కౌన్సిలర్‌ బాలమణి శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి హరీశ్‌రావు రోడ్డు నిర్మాణం గురించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెండులైన్ల రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. గజ్వేల్‌ మహంకాళీ ఆలయం నుంచి క్యాసారం గ్రామం వరకు రూ.10.50 కోట్లతో 3.5కిలోమీటర్ల రెండు లైన్ల మార్గం నిర్మించేందుకు ఇటీవల మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయగా, పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో భాగంగా మధ్యలో నాలా బ్రిడ్జిని ఇప్పటికే పూర్తి చేయగా, రోడ్డు పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు. అలాగే, క్యాసారంలో 600ల మీటర్ల మేర నాలుగులైన్ల రోడ్డును నిర్మించనున్నారు.

సీఎం చొరవతో అభివృద్ధి పథంలో గజ్వేల్‌..
గజ్వేల్‌ పట్టణంలో వందేండ్లకు సరిపడా అభివృద్ధి కేవలం ఏడేండ్లలోనే జరిగింది. గతంలో గజ్వేల్‌ నుంచి వలస వెళ్లిన వారు ఇప్పుడు అభివృద్ధి చెందిన పట్టణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. రోడ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రోడ్ల నిర్మాణంలో ఇండ్లు కోల్పోయేవారికి సముచిత న్యాయం చేయడానికి మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లాం.

  • మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌

మరింత అందంగా తీర్చిదిద్దుతాం..
రోడ్ల నిర్మాణం వల్ల కలిగే సౌకర్యాన్ని ప్రజలకు వివరించడంతో ప్రజలంతా ఇండ్ల తొలిగింపునకు సహకరిస్తున్నారు. గజ్వేల్‌లోని అన్ని ప్రధాన రహదారులను ప్రభుత్వం విస్తరించి సౌకర్యవంతంగా మారుస్తున్నది. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రోడ్లను నిర్మిస్తున్నాం. డివైడర్లపై హరితహారం ద్వారా చెట్లను కూడా పెంచి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే అన్ని మార్గాల్లో డివైడర్లు, రోడ్లకు ఇరువైపులా చెట్లను ఏర్పాటు చేసి అందంగా కనిపించేలా చర్యలు తీసుకుంటున్నాం.

  • మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటగోపాల్‌, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు..
గతంలో క్యాసారానికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఐదు నిమిషాల ప్రయాణం అరగంట అయినా చేరుకోలేకపోయేవాళ్లం. ప్రజల ఇబ్బందులను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి రోడ్డును మంజూరు చేశారు. రోడ్డు నిర్మిస్తుండడంతో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు
ప్రజల తరఫున కృతజ్ఞతలు.

  • బాలమణి, 2వ వార్డు కౌన్సిలర్‌

వేగంగా పనులు..
పట్టణంలో ఇప్పటికే నాలుగు మార్గాలను అందంగా తీర్చిదిద్దాం. కోటమైసమ్మ మార్గంతో పాటు క్యాసారం గ్రామ రహదారి పనులను వేగంగా చేపడుతున్నాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రోడ్లను నిర్మిస్తున్నాం. కోటమైసమ్మ మార్గంలో 400 మీటర్ల మేర రోడ్డును పూర్తి చేశాం. భవనాల తొలగింపు పూర్తి కాగానే మిగతా రోడ్డును ప్రారంభిస్తాం. క్యాసారం మార్గంలో బ్రిడ్జినిర్మాణం పూర్తయింది. రోడ్డు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

  • బాలప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ డీఈఈ, గజ్వేల్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement