ఎర్రగడ్డ : అన్ని పండుగలను గౌరవిస్తూ స్నేహభావంతో జరుపుకొంటున్న నగర ప్రజలు మతసామరస్యాన్ని చాటుతున్నారని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. మాజీ డిప్యూటీమేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బోరబండలో కొనసాగుతున్న సహెర్ విందుకు ఆయన గురువారం తెల్లవారుజామున హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఏటా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహెర్ విందు ఏర్పాట్లలో హిందువులు పాలుపంచుకోవటం ప్రత్యేకతగా అభివర్ణించారు. ఈ విందుకు రోజూ సుమారు 400 మంది ముస్లింలు హాజరు కావటం.. వారందరికీ ఇతర మతాలకు చెందిన మహిళలు సైతం అన్నం వడ్డించటం గొప్ప విషయమన్నారు.
బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థలను ఈ రంజాన్ మాసంలో చేస్తున్నామన్నారు. బోరబండ ప్రాంతంలో నిర్వహించే అన్ని పండుగలు గంగా జమునా తహజీబ్‌ను ప్రతిబింబింపజేస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు బాబా ఫసియుద్దీన్‌తో కలిసి సంతోష్‌కుమార్ ఉపవాసంలో ఉన్న ముస్లింలకు అన్నం వడ్డించారు.
ముస్లిం మత పెద్దలు ఎంపీ సంతోష్‌కుమార్‌ను సన్మానించి మొక్కను బహూకరించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్‌గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, టీఆర్ఎస్ నేతలు మత పెద్దలు పాల్గొన్నారు.