రైతన్న ఇంటికి పెట్టుబడి సాయం చేరుతున్నది. యాసంగి సాగుకు సిద్ధమైన తరుణంలోనే రైతుబంధు అందుతున్నది. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసి, సీఎం కేసీఆర్ పేరిట సెల్ఫోన్లకు మెస్సేజ్‌లు పంపిస్తుండడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. సీజన్ ప్రారంభంలో పెట్టుబడికి పైసలు అందుతుండడంతో సంబురపడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సారు చెప్పినట్లే రైతుబంధు సాయాన్ని పంట పెట్టుబడి, వ్యవసాయపనులకు ఉపయోగించుకుంటామని చెబుతున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పంపిస్తున్నది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా, మంగళవారం నుంచి నిధులు విడుదలవుతున్నాయి. సమయానికి పెట్టుబడి అందుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటికే ఏడు సార్లు సాయం అందించారు. ఎనిమిదోసారి నగదు పంపిణీ మంగళవారం నుంచే ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో 6,74,110 మంది రైతులు ఉండగా, ప్రాధాన్యతా క్రమంలో ఎకరంలోపు ఉన్న రైతుల ఖాతాల్లో ముందుగా జమచేస్తున్నారు. మొత్తం 13,23,780 ఎకరాలు ఉండగా, రూ.661.87 కోట్లు మంజూరయ్యాయి.
రైతులమంతా రుణపడి ఉంటం
రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్‌తోనే ఎవుసం బాగుపడ్డది. అంతకు ముందు శానా ఇబ్బందులుండె.. విత్తనాలు కొనుడు మొదలు కరంట్, ఎరువులు, నీళ్లు ఇట్ల అన్నింటికీ తిప్పలుండేది. ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ సారు నేనున్నా అంటూ బాధలు తీర్చుతుండు. కేంద్రం ధాన్యం కొననంటే ఉద్యమం చేస్తుండు. నాకు 36 గుంటల భూమి ఉంటే రూ.4500 బ్యాంక్‌ల జమైనయ్. పెట్టుబడికి సాయం చేస్తున్న సీఎంకు రైతులమంతా రుణపడి ఉంటం.
అన్ని సౌలతులు చేస్తండు
గతంల ఎవుసం చేసుడంటే ఏడుపచ్చేది. ఎన్నో కష్టాలు పడి వరి పండిచ్చేది. గిప్పుడు సీఎం కేసీఆర్ సారు ఏ బాధలు లేకుండా చేసిండు. కరంట్ వట్టిగనే ఇయ్యవట్టె. పెట్టుబడికి సర్కారే సాయంజేస్తంది. నీళ్లకు ఇబ్బందులు లేకుంట చెరువులను మంచిగ చేసిన్రు. మాలాంటి తండాను పంచాయతీ చేసి అభివృద్ధి చేసిన్రు. పంటను సర్కారే కొనవట్టె. కేసీఆర్ పాలన భేష్‌గా ఉంది. నాకు 25 గుంటలు ఉంటే రూ. 3,125 పైసలు బ్యాంక్‌లో పడ్డయ్.
రైతులకు దేవుడు
కేసీఆర్ సార్ అచ్చినంకనే ఎవుసం మంచిగ సాగుతంది. అంతకు ముందు రైతుల గోస పట్టించుకున్నోళ్లే లేరు. కేసీఆర్ సారు రైతుల కట్టాలను చూసి చలించిండు. కొత్త రాష్ట్రంల ఏ కట్టం ఉండద్దని పెట్టుబడులకు పైసలు బ్యాంక్‌ల ఏత్తండు. వీటితోనే ఇత్తునాలు, అడుగు మందులు కొంటున్నం.. దున్నడానికి, కూలీలకు ఇస్తున్నం. కరంట్ అట్టిగనే ఇత్తండు. ఇత్తనాలు, అడుగు మందులకు ఇబ్బందులు రాకుండా చూత్తండు. మమ్మల్ని మంచిగ చూత్తన్న కేసీఆర్ సార్ రైతులకు దేవుడు.
అప్పుజేయాల్సిన అవసరం లేదు
నాకు సైదాబాద్‌ల 10 గుంట భూమి ఉంది. గతంల కూలీ పని చేసుకుని పంటకు పెట్టుబడి పెట్టుకునేవాన్ని. పెద్ద సారు నా బ్యాంక్ ఖాతల డబ్బులు వేసిన్రు. నాకు ఈ పైసలు ఈసారి పంట పెట్టుబడికి పనికి వస్తయ్. ఇప్పుడు అప్పు చేయాల్సిన అవసరం లేదు.
-డి సుభాష్, సైదాబాద్ (జమ్మికుంటరూరల్)
బాధలు తప్పినయ్
నేను పది గుంటల భూమిల తినేందుకు వరి పంట సాగు చేస్తున్న. గతంలో పంట సాగు కోసం సావుకార్ల దగ్గరికెళ్లి పెట్టు బడికోసం అప్పులు చేసెటోన్ని. తెలంగాణ సర్కారు వచ్చినంక పెట్టుబడి కింద ఎకరానానికి రెండు పంటలకు రూ.10 వేలు బ్యాంక్ ఖాతాల్ల జమైతున్నయ్. నా కు ఉన్న 10 గుంటలకు రూ.1250 ఈ మంగళవారం జమైనయ్.
లాగోడికి తిప్పల్లేకుంట జేసిండు..
కేసీఆర్ సార్ రాక మునుపు లాగోడి (పెట్టుబడి) పైసలకు అరిగోస పడెటోళ్లం. ఇంట్ల సామన్లు, బంగారం కుదువపెట్టేది. అయినా ఒక్కోసారి ఒక్క రూపాయి పుట్టేది కాదు. శానా కట్టమయ్యేది. గిప్పుడు గసోంటి తిప్పల్లేవు. ఎవుసం జేసేటోళ్లకు కేసీఆర్ సారు అన్ని సౌలతులు జేత్తుండు. లాగోడికి రైతులు తిప్పలు వడకుండా బ్యాంక్‌ల పైసలు ఏత్తండు. షావుకార్ల దగ్గరికి అప్పుకు పోకుండా జేసిండు. నాకు 26 గుంటల భూమికి రూ.3,250 ఖాతాలోపడ్డట్టు సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ అచ్చింది. ఆ పైసలు తీసుకున్న. కేసీఆర్ చెప్పినట్టు వీటిని పెట్టుబడికే ఖర్సుపెడ్త.