మలక్‌పేట : డిజిటల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అందులోని వివిధ రకాల వృత్తి, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై విస్తృత సమాచారం కలిగిన పుస్తకాన్ని అందుబాటులోకి తేవటం అభినందనీయమని ఐటీ, మున్సిఫల్ శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
హైటెక్స్‌లోని హెచ్ఐసీసీలో ఇండియా జాయ్ ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా క్రియేటివ్ మల్టీ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ బుగ్గవీటి రాజశేఖర్ డిజిటర్ మీడియా రంగంలోని వివిధ రకాల వృత్తి, నైపుణ్యాలు, ఉపాధి అవకాశా లపై సంపూర్ణ సమాచారంతో రచించిన ‘ఎక్సైటింగ్ కెరియర్స్ ఇన్ డిజిటల్ మీడియా’ అనే పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అందులోని అవకాశా లను అందిపుచ్చుకునేందుకు యువతకు ఇది దిక్సూచిగా దోహదపడనుందన్నారు. డిజిటల్ మీడియా రంగంలో వస్తు న్న అనేక ఉపాధి అవకాశాలపై యువతకు సరైన సమాచారం, అవగాహనలేక ముందుకు వెళ్లలేకపోతున్నారన్నారు.
ఈ పుస్తకం ద్వారా యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్,డిజిటల్ మార్కెటింగ్, వెబ్, మొబైల్ డిజైన్‌తోపాటు ఫిల్మ్ మేకింగ్ రంగాలకు చెందిన 72 రకాల విభాగాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చునని తెలిపారు. అనంతరం క్రియేటివ్ మల్టీ మీడియా ఎండి. బుగ్గవీటి రాజశేఖర్ మాట్లాడుతూ డిజిటల్ మీడియా రంగంలో యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఆయా రంగాల్లో ప్రవేశించాలనుకునే వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడనుందన్నారు. యానిమేషన్ రంగానికి సంబంధించి అనేక అంశాలు ఈ పుస్తకంలో లోతుగా విశ్లేశించటం జరిగిందని తెలిపారు. తాను రచించిన ఈ పుస్తకం అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉందని, లేదా దిల్‌సుఖ్‌నగర్‌లోని సంస్థ కార్యాలయంలోగానీ, 9659489659 నంబర్లో సంప్రదించాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా గ్రీన్ గోల్డ్ యానిమేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చిలక రాజశేఖర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బెంగుళూరుకు చెందిన టెక్నికలర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ భీరెన్ ఘోష్, ఐటీ కార్యదర్శి జయేష్‌రంజన్, సినీ హీరో సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.