
పాపన్నపేట, డిసెంబర్ 19 : రూర్బన్ (శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్) పథకంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. వివిధ అభివృద్ధి పనులతో పాటు మహిళల స్వయం ఉపాధికి సైతం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండడంతో మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల మహిళలు లబ్ధిపొందుతున్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో కేంద్రప్రభుత్వం మం డలాన్ని రూర్భన్ పథకం కింద ఎంపిక చేసింది. ఇందులో భాగంగా మండలంతో పాటు ఇతర గ్రామాలను రూర్బన్ పథకం కింద స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసింది. ఈ క్రమంలో పాపన్నపేటలో చిక్కి(పల్లిపట్టీల) తయారీ ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనికోసం ప్రభుత్వం రూ. 19 లక్షలను కేటాయించింది. నిధులు మొత్తం సబ్సిడీ కింద మంజూరు చేయగా, మండల కేంద్రానికి చెందిన మూడు డ్వాక్రా సంఘాల నుంచి 10మంది సభ్యులను ఎంపిక చేసి వీరికి ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. దీంతో, చిక్కీల కేంద్రంలో పల్లిపట్టీలు, రవ్వలడ్డూలు, పేలాల ఉండలు తయారు చేస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. అలాగే, గాంధారిపల్లిలో సైతం రూ. 12లక్షలతో జ్యూట్‌బ్యాగుల కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ కేంద్రంలో రకరకాల అందమైన బ్యాగులు తయారు చేస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో తయారు చేసిన వివిధ వస్తువులను ఆయా గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా మెదక్ కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఔట్లెట్ షాప్‌లో సైతం వీటిని విక్రయిస్తున్నారు. ఇటీవల పంద్రాగష్టు సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు హాజరైన మంత్రి శ్రీనివాస్‌యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పల్లిపట్టీలను చూసి, వాటిని తయారు చేసిన మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఔట్లెట్ కేంద్రం ద్వారా వీటిని అమ్మాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైతే తక్కువ ధరలో బ్యాగులు తయారు చేసి ఇస్తామని జ్యూట్ బ్యాగుల కేంద్రం నిర్వాహకులు వెల్లడించారు. తమ పల్లిపట్టీలు, రవ్వ లడ్డూలను వివిధ అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు కొనుగోలు చేసేలా చూడాలని ఆ కేంద్రం నిర్వాహకులు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, మండల పరిధిలోని అర్కెల, మల్లంపేట గ్రామాల్లో పేపర్ బ్యాగులు, పేపర్గ్లాస్ కేంద్రాల నిర్మాణం దాదాపు పూర్తయ్యాయని, త్వరలో వీటిని కూడా ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
గ్రామీణ మహిళలకు ఉపాధి
రూర్బన్ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి లభిస్తున్నది. పాపన్నపేట మండలంలో వివిధ వ్యాపారాలకు సంబంధించిన నాలుగు యూనిట్లు మంజూరయ్యాయి. పాపన్నపేటలో పల్లిపట్టీల యూనిట్ చాలా బాగా నడుస్తున్నది. గాంధారిపల్లిలో ఏర్పాటు చేసిన జ్యూట్‌బ్యాగుల తయారీ కేంద్రానికి ఆదరణ బాగుంది. అర్కెల, మల్లంపేట గ్రామాల్లో పేపర్ బ్యాగులు, పేపర్ గ్లాసుల యూనిట్లు పూర్తయ్యాయి.
పాపన్నపేటలో రూర్బన్ పథకం ద్వారా పల్లిపట్టీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ కేంద్రం విజయవంతంగా నడుస్తున్నది. దీని ద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి దొరుకుతున్నది. మేము తయారు చేసిన వస్తువులను అంగన్వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేస్తే మాకు మంచి మార్కెట్ సౌకర్యం కలుగుతుంది.