నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 11: ఉద్యోగుల విభజనను ఈ నెల15వ తేదీ వరకు పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలతోపాటు షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 9,10వ తేదీల వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లును స్వీకరించి, సీనియార్టీ జాబితాను అప్డేట్ చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శనివారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టారు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, నిజామాబాద్ పూర్వ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ హాజరై 22 శాఖలకు సంబంధించిన ఉద్యోగుల ఆప్షన్లపై బదిలీల ప్రక్రియను పరిశీలించారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు 1400 మందికి అలాట్మెంట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటిరోజు వ్యవసాయశాఖ, బీసీ, ఎస్సీ, మైనార్టీ వెల్ఫేర్, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ తదితర శాఖలకు సంబంధించి ఉద్యోగులు పాల్గొన్నారు. రెండో రోజు కూడా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా క్యాడర్ ఉద్యోగుల ఆప్షన్ల కేటాయింపుపై పరిశీలనకు వచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, నిజామాబాద్ పూర్వ కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.