
వాన, చలి, ఎండ.. కాలమేదైనా ‘గొంగడి’ రక్షణ కవచంలా పనిచేస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దీనికి ప్రత్యేక స్థానమున్నది. గొల్లకురుమలు ప్రకృతి సిద్ధంగా నేసి విక్రయించే ఈ ప్రాచీన వస్త్రం నేటి రెడీమేడ్ యుగంలో కనుమరుగవుతున్నది. ఒకప్పుడు పల్లెల్లో కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని విక్రయించిన అనేక మంది.. నేడు ఆ పని సాగక ఖాళీగా ఉంటున్నారు. దక్కన్ జాతి గొర్రెల నుంచి సేకరించిన నాణ్యమైన ఉన్నితో తయారుచేసిన గొంగళ్లకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉండేది. సైన్యంలోనూ ఉపయోగించినట్లు చెబుతుంటారు. ఆ జాతి అంతరించిపోవడంతో గొంగళ్ల తయారీ కూడా మెల్లిగా మూలకు పడుతున్నది. అయితే, ప్రభుత్వం గొర్రెల పంపిణీతో తమకు అండగా నిలుస్తున్నప్పటికీ, మళ్లీ దక్కన్ గొర్కెలను అందజేస్తే గొంగళ్ల పరిశ్రమకు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కొన్ని కుటుంబాలే వీటిని నేస్తుండగా, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తే మరిన్ని కుటుంబాలకు
జీవనోపాధి దొరుకుతుందని అంటున్నారు.
బుజానికి గొంగడి.. చేతిలో జెండాతో జాతర పోదామా.. తెలంగాణ జాతర పోదామా… అని గోసి, గొంగడి వేసుకొని మన కళాకారులు ‘గొంగడి’ గొప్పతనాన్ని ఇప్పటికీ అనేక వేదికలపై తమ ఆటపాటలతో ఎలుగెత్తి పాడుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో గొంగడికి ప్రత్యేక స్థానముంది. ఎనకట గొర్రెల బూరుతో గొంగడిని నల్లగా, మందంగా పేనేవారు మన గొల్ల కుర్మలు. పెద్ద మనుషులకు అప్పట్లో గొంగడి ఒక ఆభరణం, ఆయుధం లెక్క పని చేసింది. వాన, చలి, ఎండ.. కాలమేదైనా ‘గొంగడి’రక్షణ కవచంలా పనిచేస్తుంది. పల్లెటూరిలో ఒక్కొక్కరి ఇండ్లల్లో నాలుగైదు గొంగళ్లు ఉండేవి. శాన మంది పెద్దమనుషులు గొంగళ్లను విపరీతంగా ఇష్టపడేవారు. గొల్లకురుమలు ప్రకృతి సిద్ధంగా నేసి విక్రయించే ఈ ప్రాచీన వస్త్రం నేటి రెడీమేడ్ యుగంలో కనుమరుగవుతున్నది. దక్కన్ జాతి గొర్రెల నుంచి సేకరించిన నాణ్యమైన ఉన్నితో తయారు చేసిన గొంగళ్లకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉండేది. రానురాను ఆ జాతి అంతరించిపోవడంతో గొంగళ్ల తయారీ కూడా ఇప్పుడు మూలకు పడుతున్నది. అయితే, ప్రభుత్వం గొల్లకుర్మలకు గొర్రెలను అందజేసి తమకు అండగా నిలుస్తున్నప్పటికీ, మళ్లీ దక్కన్ గొర్కెలను అందజేస్తే గొంగళ్ల పరిశ్రమకు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అన్ని కాలాల నేస్తం..
ఎండకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా, వర్షాకాలంలో గొడుగుగా సబ్బండవర్గాలకు గొంగడి రక్షణ కవచంగా నిలిచింది. ఎనకట ఊళ్లల్ల్లో వాన ఎంత పడ్డదని ఎవరైనా అడిగితే, గొంగడి తడుపు వాన పడ్డదని చెప్పేటోళ్లు. అంటే అప్పట్లో వర్షపాత సూచికగా కూడా ఈ గొంగడిని వాడేవాళ్లు.
గొల్లకురుమలకు పవిత్ర వస్త్రం..
గొంగడిని గొల్లకురుమలు ఓ పవిత్ర వస్త్రంగా భావిస్తారు. ఐదేండ్లు, తొమ్మిదేండ్ల వయస్సు కలిగిన మగ పిల్లలకు ‘పుట్టు గొంగడి’ కప్పడం ఇప్పటికీ ఆ కులాల్లో ఆనవాయితీగా వస్తున్నది. పెండ్లిళ్ల సమయాల్లో ఉన్ని ధారమే కంకణంగా ధరిస్తారు. చిన్న పిల్లలకు దిష్టి తీయడం, మొలతాడుగా గొంగడి ధారాన్ని కట్టుకోవడం చేస్తుంటారు. దేశ సరిహద్దుల్లో చలి నుంచి రక్షణ పొందేందుకు సైనికులు కూడా ఒకప్పుడు తెలంగాణ గొంగళ్లను వినియోగించేవాళ్లు అని పెద్దలు చెబుతుంటారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాచీన వస్త్రం ప్రస్తుతం ఉనికిని కోల్పోతున్నది.
కుటీర పరిశ్రమగా గొంగళ్ల తయారీ..
నాడు పల్లెల్లో గొల్ల కురుమలు ఇంట్లోనే చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేసుకుని గొర్ల నుంచి సేకరించిన ఉన్నితో తయారుచేసిన ఈ ఏకో ఫ్రెండ్లీ గొంగడి, కాలక్రమేణా కనుమరుగై పోతున్నది. ఇరవై సంవత్సరాల క్రితం వరకూ తెలంగాణలోని ప్రతి పల్లెలో గొంగళ్ల తయారీ ఓ కుటీర పరిశ్రమగా ఉండేది. గొల్లకురుమలు జీవాల పోషణకు అనుబంధంగా గొంగళ్ల తయారీతో జీవనోపాధిని పొందేవాళ్లు. పొద్దంతా మగవాళ్లు జీవాలను మేపేందుకు వెళ్తే, ఆడవాళ్లు ధారం వడుకుతూ గొంగళ్ల తయారీలో నిమగ్నమయ్యేవాళ్లు. దక్కన్ జాతికి చెందిన నల్ల గొర్రెల నుంచి సేకరించిన మేలైన ఉన్నితో ప్రకృతి సహజసిద్ధంగా, ఎలాంటి రసాయనాలు వాడకుండా అంబలి సహాయంతో గొంగళ్లను తయారు చేసేవారు. ఎక్కువగా నలుపు, తెలుపు గొంగళ్లు ప్రాచుర్యంలో ఉన్పప్పటికీ, ఏడు రకాల గొంగళ్లు ఉన్నట్లు పెద్దలు చెబుతుంటారు. దక్కన్ జాతి గొర్రెలు అంతరించడంతో పాటు ప్రపంచీకరణతో దుప్పట్లు, రగ్గులు తక్కువ ధరకు రావడంతో ఈ కుటీర పరిశ్రమ కూలిపోయింది. అయినప్పటికీ నేటికీ కొన్ని ప్రాంతాల్లో అక్కడ క్కడా గొంగళ్లను నేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గొంగడికి మన్నికను బట్టి రూ. 500ల నుంచి రూ.4వేల వరకు ధరల్లో లభిస్తున్నాయి. కాగా, గొంగళ్ల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు ఏటా హైదరాబాద్ లాంటి నగరాల్లో గొంగళ్ల ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నాయి.
తెలంగాణ వారసత్వ సంపదగా..
భావితరాలకు తెలంగాణ వారసత్వ సంపదగా గొంగడిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, అంతరించిపోతున్న గొంగడిని బతికించుకునేందుకు చర్యలు చేపట్టాలని గొల్లకురుమలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్లకురుమలకు సబ్సిడీతో జీవాలను అందించి ఆ దిశగా కొంత ప్రయత్నం చేస్తున్నదని, అయితే, దక్కన్ జాతి నల్ల గొర్రెలను పంపిణీ చేసినైట్లెతే మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. చేనేత రంగానికి అనుబంధంగా ఉన్న జౌళిశాఖ ద్వారా గొంగళ్ల తయారీని ప్రోత్సహించేందుకు రాయితీపై ప్రోత్సాహకాలను అందించినైట్లెతే, గొంగళ్ల తయారీ పరిశ్రమ పూర్వవైభవం సంతరించుకుంటుందని భావిస్తున్నారు.
మా కచ్చుల నేనే వడుకుతున్న..
మా కచ్చుల గొంగళ్లు నేసేటోళ్లు, వడికెటోళ్లు చాలా తక్కువయిండ్రు. ఇంటికాడ పొద్దుపోక దండెకదురుతోటి గొంగడి కడెనూలు వడుకుతున్న. మా అయ్య, అవ్వకూడా గొంగళ్లు నేసేటోళ్లు. నేసెటోళ్లు లేక గిరాకీ తగ్గింది. సర్కారు సాయం చేస్తే చాలా కుటుంబాలు బతుకుతయి.
గొంగడే మాకు దిక్కయ్యేది..
ఇప్పటి పిల్లలు గొంగడి కప్పుకునుడు మోటు అనుకుంటుండ్రు. దీంతో ఉన్న సౌలత్ దేనితో ఉండదు. మేము గొర్లు కాసేటప్పుడు అడవికి పోయినప్పుడు గొంగడి చానా అక్కరకొచ్చేది. వానొచ్చినా, ఎండకొట్టినా, చలి పెడుతున్నా మాకు గొంగడే దిక్కయ్యేది. మా ఇండ్లళ్ల అందరికీ గొంగడి ఉంటది.
గిరాకీ తగ్గుతున్నది..
నేను ఇరవై ఏండ్ల నుంచి గొంగళ్ల బేరం చేస్తున్న. అప్పుడు ఊర్లళ్ల బాగా గిరాకీ ఉండేది. ఇప్పుడు కొనేటోళ్లు చాలా తక్కువయిండ్రు. ఏమున్నా గొల్లకురమల ఇండ్లళ్ల పండుగలు చేసుకునేటప్పుడే గొంగళ్లు కొంటుండ్రు. గొంగడి తీరు రేటుంది. రూ.5వందల నుంచి మొదలుకొని రూ.4వేల వరకు ధరలు ఉన్నయి.