నిజామాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒమిక్రాన్ రూపంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనాతో మరోమారు జాగ్రత్తలు తీసుకోవడం, కరోనా మార్గదర్శకాలను పాటించడం అన్నది అనివార్యంగా మారింది. నాకేం కాదులే అన్న నిర్లక్ష్యం తో కరోనా చూపించే ప్రభావం భారీగానే ఉండబోతోంది. ఇందులో భాగంగా భౌతిక దూరం, మా స్కులు వాడకం వంటివి ప్రభుత్వం తప్పనిసరి చేయగా… నూతన సంవత్సర వేడుకలపైనా పలు ఆంక్షలను విధించింది.
బాధ్యతగా మెదులుదాం…
రెండేండ్ల కాలం నుంచి కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తున్నది. మానవ సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. 2020, మార్చిలో మొదటి కేసు నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూడడంతో మొదలైన కరోనా వ్యాప్తి నేటికీ తగ్గుతూ… పెరుగుతూ… సాగుతూనే ఉంది. వైద్యారోగ్య శాఖ వెల్లడిస్తున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 5లక్షల 39వేల 339 మందికి ర్యాపిడ్ టెస్టు విధానంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు 20,084 మందికి చేశారు. మొత్తం 5లక్షల 59వేల 423 మందికి నిర్వహించిన వివిధ పరీక్షల్లో ఇప్పటి వరకు 57,564 మందికి కరోనా సోకింది. ఇంకా రోజుకు ఒకటి లేదంటే రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉండగా.. ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కలకలం సృష్టిస్తున్నది. నిజామాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు భారీగా వెలుగు చూస్తుండడంతో పాటు రాష్ట్రంలోనూ కొత్త వేరియంట్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నూతన సంవత్సర వేడుకల పేరిట విచ్చలవిడిగా జరిగే తంతుతో వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆంక్షలు విధించింది.
కంటికి కనిపించని కరోనా వైరస్ మూలంగా ఎదురయ్యే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. డెల్టారకం వైరస్ ఉధృతితో సెకండ్ వేవ్‌లో చాలా మంది మరణించిన దాఖలాలు అనుభవంలోనే ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టడంతో కరోనా ఉధృతి కొద్ది నెలలుగా అదుపులో ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు విదేశాల్లో మరో వేరియంట్ పుట్టుకురావడంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు షురూ అయ్యాయి.
రూ.వేయి జరిమానా విధింపు..
మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పక్కాగా అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి మరో వేవ్ రూపంలో వచ్చే ప్రమాదం ఉండడంతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్కులు లేకుండా బయటికి రావడం ఇక మీదట కుదరదు. తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని సర్కారు ఆదేశాలిచ్చింది. కరోనా కట్టడి విషయంలో మాస్కులు కీలక భూమిక పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఇవి ఉపయోగపడతాయి. డబుల్ లేయర్‌తో గృహాల్లోనూ మాస్కులు తయారు చేసి పెట్టుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంటున్నది. ప్రజలు మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో జాగ్రత్తలు పాటిస్తున్న వారే కనిపించడం లేదు. నిర్లక్ష్య పూరిత వైఖరితోనే వైరస్ త్వరగా మనుషులను చుట్టేసిన అనుభవాన్ని ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో గమనించాం. అయినప్పటికీ ప్రజల్లో భయమనేది కనిపించకపోవడం శోచనీయంగా మారింది. ప్రజా ప్ర యోజనాల దృష్ట్యా రూ.వేయి జరిమానాతో తప్పకుండా మాస్క్ ధరించని వ్యక్తులపై కొరడా ఝుళిపించేందుకు పోలీసులు నడుం బిగించారు. రెండు రోజులుగా సీరియస్‌గా డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
చెల్లింపులు కోర్టుల్లోనే…
మొన్నటి వరకు మాస్కులు ధరించని పౌరులపై పోలీసులు వేసిన జరిమానాలను ఆన్లైన్లోనే చెల్లించే విధానం ఉండేది. అక్కడికక్కడే ఫైన్ పడిన వారంతా రుసుము కట్టి వెనుదిరిగే వారు. ఇకపై అలాంటి అవకాశం లేకుండా పోయింది. మాస్కు లేకుండా తిరుగుతూ పోలీసులకు పట్టుబడి జరిమానా చెల్లించాల్సి వస్తే సదరు వ్యక్తులు నేరుగా కోర్టుకు వెళ్లాల్సిందే. కోర్టులోనే ఫైన్ చెల్లించి రసీదు తీసుకోవాల్సి ఉంటుంది. సామాజిక బాధ్యతను గుర్తుకు తెచ్చేందుకు పోలీస్ శాఖ ఈ రకమైన ఏర్పాట్లు చేస్తున్నది. మాస్కుల్లేకుండా తిరుగుతున్న వారిలో చాలా మంది గతంలో రూ.100 జరిమానా అనేక సార్లు చెల్లించిన వారున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి జరిమానాను 10 రెట్లు పెంచింది. జరిమానాను భారీగా పెంచినా కొంత మందిలో మార్పు రావడం లేదు. ఇందులో భాగంగా ఆన్లైన్ చెల్లింపులకు బదులుగా కోర్టుల్లో జరిమానాలు చెల్లించే విధానాన్ని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ప్రతి ఒక్కరూ మాస్కు లు ధరించి పోలీసు శాఖకు సహకరించాలంటూ ఆయా ఠాణాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పోలీసులు డ్రైవ్ చేపడుతున్నప్పటికీ కొంత మందిలో సామాజిక స్పృహ అన్నది మచ్చుకూ కనిపించకపోవడం విడ్డూరంగా మారింది.
ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలి…
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం నూతన సంతవ్సర వేడుకలపై ఆంక్షలు కొనసాగుతాయి. కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా నిబంధనలను అమలు చేస్తాం. ఎవరూ కొవిడ్-19 మార్గదర్శకాలు ఉల్లంఘించొద్దని ప్రజలకు విన్నవించుకుంటున్నాం. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాతో యుద్ధం ఇంకా ముగియలేదు. మనమంతా బాగుండాలంటే బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం.