
నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
దశాబ్దాల దరిద్రం పోయేలా అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని, అందుకు ఎన్ని నిధులైనా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే కసరత్తు మొదలైంది. ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగానే నేడు నల్లగొండలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటించనున్నారు. పట్టణాభివృద్ధిపై చర్చించనున్నారు. రూ.50కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్‌కు పునాదిరాయి వేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు శంకుస్థాపనతోపాటు ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల భవనాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట మాదిరిగా నల్లగొండను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడానికి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే సమయంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధిపైనా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి మారయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి శుక్రవారం తొలి అడుగు పడనున్నది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పట్టణ సమగ్ర అభివృద్ధికి కార్యచరణ సిద్ధ్దం కానున్నది. ఇందుకోసం అధికారులతో కలిసి మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి నేడు జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఐటీ హబ్, మెడికల్ అండ్ వెటర్నరీ కళాశాలల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ప్రధాన రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధ్ది, అర్బన్ పార్కుల ఏర్పాటు, ట్యాంకుబండ్ అభివృద్ధ్ది, శిల్పారామం నిర్మాణం, ఎన్జీ కళాశాల నూతన భవనం, నూతన టౌన్‌హాల్, డబుల్బెడ్రూం ఇండ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ తదితర అంశాలపై వారు దృష్టి సారించనున్నారు. వీటీ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించడంతోపాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధ్ది ప్రణాళికలు రూపొందించనున్నారు. అన్నిరంగాల్లోనూ పట్టణానికి అభివృద్ధ్ది చేయడమే లక్ష్యంగా మంత్రుల పర్యటన సాగనున్నది.
ఐటీ హబ్‌కు శ్రీకారం..
నల్లగొండ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో రూ.50 కోట్లతో పట్టణానికే తలమానికంగా ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నూతన భవనాలను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే నియోజకవర్గ ప్రజలతో నిర్వహించే సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు. ఐటీ హబ్‌కు భవిష్యత్‌లో మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నది. నల్లగొండ అభివృద్ధ్దిపై గతంలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూనే.. ప్రస్తుతం చేపట్టాల్సిన పనులను ప్రజలకు వివరించనున్నారు. అనంతరం బీట్ మార్కెట్లో అత్యాధునికంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌కు పునాదిరాయి వేయనున్నారు.
పలు ప్రాంతాల్లో పర్యటించే అవకాశం..
పట్టణంలోని పలు ప్రాంతాలను మంత్రులు పరిశీలించే అవకాశం ఉంది. క్లాక్‌టవర్ సెంటర్లోని ఇరిగేషన్, ఆర్అండ్బీ కార్యాలయాల స్థలాలతో పాటు ప్రధాన రహదారుల విస్తరణ, దేవరకొండ రోడ్డులో జంక్షన్ల అభివృద్ధ్ది అంశాలను పరిశీలించనున్నట్లు తెలిసింది. వీటితోపాటు పట్టణ అవసరాలకు అనుగుణంగా ఎమ్మెల్యే, కలెక్టర్లతో చర్చించి పలు పనుల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం గంధంవారిగూడెం రోడ్డులోని జీఎం కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై మంత్రి జగదీశ్‌రెడ్డితో కేటీఆర్ సమీక్షించనున్నారు .
ఎమ్మెల్యే కిశోర్‌ను పరామర్శించనున్న కేటీఆర్
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించనున్నారు. కిశోర్‌కుమార్ తండ్రి మారయ్య ఇటీవల మృతి చెందగా, బుధవారం నిర్వహించిన దశదినకర్మకు సీఎం కేసీఆర్ హాజరై నివాళులర్పించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్ సైతం గాదరి కిశోర్‌కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి, మారయ్యకు నివాళులర్పించనున్నారు.
భారీగా ఏర్పాట్లు..
నల్లగొండలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్‌తోపాటు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిలకు ఎంజీ యూనివర్సిటీ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీ నడుమ మంత్రుల బృందం పట్టణంలోకి చేరుకోనున్నది. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఐటీ హాబ్ శంకుస్థాపన అనంతరం నియోజకవర్గ కార్యకర్తలు, జనంతో సభకు ఏర్పాట్లు చేశారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణతోపాటు పానగల్‌లోని ఎంజీ యూనివర్సిటీ భవనాన్ని, వల్లభరావు చెరువును, నీలగిరి నందనవనాన్ని గురువారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ పాటిల్ పరిశీలించి అభివృద్ధి నివేదికలు సిద్ధ్దం చేశారు. వీటిని శుక్రవారం మంత్రులకు అందజేయనున్నారు. నల్లగొండ అభివృద్ధ్దిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ప్రకటించిన విధంగానే నల్లగొండకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల సహకారంతో నల్లగొండను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ఇలా..