సంగారెడ్డి మున్సిపాలిటీ, డిసెంబర్ 16 : సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లా దవాఖానతో పాటు నారాయణఖేడ్ సీహెచ్సీ, జోగిపేట సీహెచ్సీ, జహీరాబాద్ అర్బన్ హెల్త్ సెంటర్, సదాశివపేట సీహెచ్సీ, పటాన్చెరు అర్బన్ హెల్త్ సెంటర్లలో గర్భిణులు అధికంగా చేరుతున్నారు. సంగారెడ్డి జిల్లా దవాఖానలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో బెడ్లతో పాటు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో ప్రసవాలకు గర్భిణులు ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మొత్తం 9,237 ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరిగాయి. ఇందులో సంగారెడ్డి మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో 2,911 సాధారణ, 2,210 సిజేరియన్ కాన్పులు జరిగాయి. నారాయణఖేడ్ సీహెచ్సీలో 361 సాధారణ, 9 సిజేరియన్ జరిగాయి. అలాగే, జోగిపేట సీహెచ్సీలో 347 సాధారణ, 100 సిజేరియన్ కాన్పులు జరిగాయి. జహీరాబాద్ అర్బన్ హెల్త్ సెంటర్లో 1,313 సాధారణ, 1,131 సిజేరియన్ జరిగాయి. సదాశివపేట సీహెచ్సీలో 110 సాధారణ, 12 సిజేరియన్ జరిగాయి. పటాన్చెరు అర్బన్ హెల్త్ సెంటర్లో 395 సాధారణ, 338 సిజేరియన్ జరిగాయి. కాగా, జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 5,437 సాధారణ, 3,800 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి.
ప్రభుత్వ దవాఖానలపై పెరిగిన భరోసా..
జిల్లాలోని మాతాశిశు రక్షణ కేంద్రంతో సహా అన్ని ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు భరోసా పెరుగుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి నవంబర్ వరకు మొత్తం 9,237 ప్రసవాలు జరిగాయి. ఇందులో 5,437 సాధారణ, 3,800 సిజేరియన్ కాన్పులు చేశాం. ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లోని సేవలను వినియోగించుకోవాలి. గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
-డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సంగారెడ్డి