నిజామాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల కోసం గులాబీ దళం పోరుబాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వైఖరిని అడుగడుగునా ఎండగట్టాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇ చ్చిన పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ అడుగడుగునా దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శవయాత్రలు నిర్వహించారు. గులాబీ పార్టీ మరోమారు ఉద్యమించడంతో ఉభయ జిల్లాల్లో గ్రామాలు, పట్టణాలు, నిజామాబాద్ నగరం హోరెత్తింది. టీఆర్ఎస్ పోరుబాటకు మేముసైతం అంటూ అనేక మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపారు. కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఊరూ రా జరిగిన ఆందోళన కార్యక్రమాలు జనాన్ని ఆలోచింపజేశాయి. కమలం పార్టీ వైఖరిని నిరసిస్తూ రైతులు, ప్రజలంతా రోడ్డెక్కి నినదించారు. ప్రధాని మోదీ నిరంకుశ వైఖరిని ప్రజలకు తెలిపేందుకు చావుడప్పు నిర్వహించారు. పార్లమెంట్ సాక్షిగా ఆడిన పచ్చి అబద్ధాలను నేతలంతా రైతులకు వివరించారు.
దిష్టిబొమ్మను దహనం చేసిన బాజిరెడ్డి…
గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఉభయ జిల్లాల్లో నేతలంతా కదిలివచ్చారు. రైతుల పొట్ట కొట్టేందుకు సిద్ధమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై చావుడప్పు మో గించాలన్న పిలుపుతో ప్రజా ప్రతినిధులే స్వయంగా డప్పు వాయించి నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్వయంగా బీజేపీకి వ్యతిరేకంగా నినదించారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గడీల రాములుతో కలిసి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాల్కొండ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు ఉవ్వెత్తున నిర్వహించారు. కేసీఆర్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రికి సంఘీభావం తెలిపే విధంగా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 8గంటల నుంచే బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో జన సమూహం భారీగా తరలి వచ్చి మోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడంతో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులకు వణుకు పుట్టినట్లు అయ్యింది.
డప్పు కొట్టిన నేతలు..
బాన్సువాడ నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పో చారం సురేందర్ రెడ్డి నిరసన ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. వర్ని మండల కేంద్రం లో ఇరువురు నేతలు కలిసి స్వయంగా డప్పు కొట్టి శ్రేణులను ఉత్తేజపరిచారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాన్సువాడలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు భారీగా జరిగాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వయంగా మాక్లూర్ మండలం మదనపల్లిలో కేంద్రానికి వ్యతిరేకంగా చావు డప్పు కొట్టారు. మాక్లూర్ మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో నగరపాలక సంస్థ ఎదురుగా చౌరస్తాలో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా చావు డ ప్పు కొట్టారు. బోధన్ మండలం సాలూరా వద్ద ఎమ్మె ల్యే షకీల్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటగిరి, రుద్రూర్, బోధన్, రెంజల్ వంటి గ్రామాల్లో సెటిలర్లు సైతం స్వయంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ధర్నాలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. లింగంపేటలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మద్నూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి పాడె కట్టి… స్వయంగా మోశారు. నిజాంసాగర్‌లో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు నేతృత్వంలోనూ చావు డప్పు మారుమోగింది.
కదిలొచ్చిన రైతులు, ప్రజలు..
రైతు మేలును ఆకాంక్షించి గడిచిన నెలన్నర రోజులుగా టీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరిని ప్రజల్లో ఎండగడుతూ ధర్నాలు, రాస్తారోకోలు, వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలను టీ ఆర్ఎస్ తలపెట్టింది. హైదరాబాద్ వేదికగానూ సీఎం స్వయంగా ధర్నాలో పాల్గొనగా.. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులంతా మోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన చావు డప్పు కార్యక్రమం జయప్రదమైంది. కేసీఆర్ ఆదేశాలతో ఎక్కడికక్కడే టీఆర్ఎస్ నాయకులంతా మోదీ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పాడె కట్టారు. దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు వేయికి పైగా గ్రామాల్లో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. పలు చోట్ల ఆగ్రహించిన రైతులు, ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు శవ యాత్రలు సైతం నిర్వహించారు.
అన్నదాతను దగా చేస్తున్న కేంద్రం
దేశానికి వెన్నెముక అయిన రైతును కేంద్రం దగా చేస్తున్నది. అన్నదాతల జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరిని విడనాడాలి. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతాం. ధాన్యం సేకరణ విషయంలో స్పష్టత ఇచ్చే వరకు పోరాటాలను కొనసాగిస్తాం.
తీరు మార్చుకోవాలి..
ధాన్యం సేకరణ విషయంలో కావాలనే కేంద్రం నిర్ల క్ష్యం వహిస్తున్నది. ఇకనైనా కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరు మార్చుకోవాలి. మన రాష్ట్రంలోని రైతుల విషయంలో ఒక రకంగా, ఇతర రాష్ర్టాల రైతుల విషయంలో మరో రకంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. కేంద్రం తీరు మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం
ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం దిగి వచ్చే వరకు పోరా టం ఆగదు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రైతులతో రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండ వు. రైతులకు సీఎం కేసీఆర్‌పై వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది.
కేంద్రం మెడలు వంచుతాం..
యాసంగిలో కేంద్రం వడ్లు కొనుగోలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చే స్తాం. ప్రధానమంత్రి మో దీ దిగివచ్చే వరకు రాష్ట్ర రైతుల పక్షాన అండగా ఉం టాం. మన రాష్ర్టాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకే కేంద్రం ధాన్యం సేకరణ విషయంలో కొర్రీలు పెడుతున్నది. కేంద్రం మెడలు వంచైనా యాసంగిలో వడ్లు కొనుగోలు చేయిస్తాం.
-గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్
మరో ఉద్యమానికి సిద్ధం
రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే మరో ఉద్యమాన్ని చేపడుతాం. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇకనైనా కేంద్రం తీరు మార్చుకుని ధాన్యం సేకరణపై స్పష్టతనివ్వాలి.
కేంద్రానివి కక్ష్య సాధింపు చర్యలు
రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. రైతుల పట్ల కక్ష్య సాధింపు చర్యకు పాల్పడుతున్నది. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతాం. యాసంగిలో కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే.
-జాజాల సురేందర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే