రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
వికారాబాద్ జిల్లాలోని మర్పల్లిలో అత్యల్పంగా 8.1 డిగ్రీలు
జిల్లాలోని మర్పల్లిలో అత్యల్పంగా 8.1 డిగ్రీలు
ఇబ్బందుల్లో చిన్నారులు, వృద్ధులు
వణికిపోతున్న వృద్ధ్దులు, చిన్నారులు
జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు
పరిగి, డిసెంబర్ 19 :వామ్మో చలి.. రోజంతా చలే.. చలి పులి గర్జిస్తూ పంజా విసురుతోంది.. సూర్యోదయం మొదలు.. సంధ్యా సమయం వరకూ.. సంధ్యాసమయం నుంచి సూర్యోదయం వరకూ.. చెద్దర్లు కప్పుకున్నా.. స్వెట్టర్లు వేసుకున్నా.. మంకీ క్యాపు పెట్టుకున్నా… మప్లర్లు కట్టుకున్నా.. గజగజ వణికించవట్టే.. వికారాబాద్ జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం మర్పల్లిలో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం కొన్ని ప్రాంతాల్లో పొగమంచుతో రోడ్లు కనిపించక రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బయటకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలతో జనం గజగజ వణికిపోతున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిలో రాష్ట్ర స్థాయిలోనే రికార్డు అత్యల్ప ఉష్ణోగ్రతలు నాలుగు రోజులుగా నమోదవుతున్నాయి. మర్పల్లిలో ఆదివారం అత్యల్ప ఉష్ణోగ్రత 8.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇక్కడ నాలుగు రోజులుగా వరుసగా గురువారం 9.3, శుక్రవారం 8.9, శనివారం 7.4, ఆదివారం 8.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
స్వెట్టర్లు వేసుకొని, మఫ్లర్లు కట్టుకున్నా వణుకు తగ్గడం లేదు. గ్రామాల్లో చలిమంటలు సైతం వేసుకుంటున్నారు. వృద్ధులు, చిన్నారులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల తరువాత కూడా బయటకు రావాలంటే భయపడుతున్నారు. చిన్నారులు తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్తున్నారు. ఉదయం పొగమంచుతో కనిపించని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా రాబోయే రెండుమూడు రోజుల్లో సగటున రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా పరిధిలో మరింత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న తరుణంలో తప్పనిసరయితేనే ఉదయం సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలని, లేకపోతే బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. శీతాకాలంలో ఎప్పటికప్పుడు ఆహారపదార్థాలు తయారుచేసుకొని వేడిగా ఉన్నపుడు తినడం మంచిదని పేర్కొంటున్నారు.