
వినియోగదారులకు షాక్ తగిలేలా కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ చట్టానికి ఆమోద ముద్ర లభిస్తే అధిక ప్రభావం మన మీదే.. రాష్ర్టాల పరిధిలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇక కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. మొదట్లో కొత్త స్కీమ్‌లు ఆశ చూపి తర్వాత ఊహించని స్థాయిలో బిల్లులు వసూలు చేయనున్నారు. నష్టాల పేరుతో సబ్సిడీ కరెంట్‌కు కూడా మంగళం పడనున్నారు. వ్యవసాయానికి మీటర్లు పెడతారు.. ప్రతి ఒక్కరూ కేంద్రం నిర్దేశించే ప్రకారం బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. నెలకు రూ.100 బిల్లు వచ్చే వినియోగదారుడికి ఊహించని విధంగా బిల్లు వచ్చే ప్రమాదం ఉన్నది. ఆ తర్వాత సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేయనున్నారు. కేవలం విద్యుత్ ఉద్యోగుల సమస్యే కాదు.. ప్రజల నెత్తిన పిడుగులా మారే ఈ చట్టాన్ని అడ్డుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చట్టం అమలైతే ఇక సర్వ నాశనమే అని 1104 యూనియన్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కొత్త విద్యుత్ చట్టం మనకు సంబంధించింది కాదు.. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించింది’ అనే భావన చాలా మందిలో ఉన్నది. కానీ, ఈ చట్టానికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే మొదట ప్రభావం పడేది మన మీదే. సబ్సిడీ విద్యుత్ కనుమరుగవుతుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ రంగం కేంద్రం పరిధిలోకి వెళ్తుంది. రాష్ర్టాల పరిధిలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కేంద్రం గుప్పిట చిక్కుతుంది. దీంతో నష్టాలను చూపించి వ్యవసాయ రంగం, పరిశ్రమలు, గృహాలు, ఇతర రంగాలకు అందిస్తున్న సబ్సిడీ విద్యుత్ కనిపించదు. ప్రతి ఒక్కరూ కేంద్రం నిర్దేశించనున్న ప్రకారం బిల్లులు చెల్లించాల్సిందే. నెలకు రూ.100 వచ్చే బిల్లు కొత్త చట్టం ప్రకారం ఊహించని విధంగా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది. కేంద్రం విద్యుత్‌ను తన చేతిలోకి తీసుకుంటే వ్యవసాయ కరెంట్‌కు మీటర్లు పెడతారు. నెలకు రూ.వేలల్లో బిల్లులు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది. తర్వాత సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్‌పరం చేసే అవకాశం కూడా ఉన్నది. ప్రైవేట్ వ్యక్తులు మొదట ఆకర్షణీయంగా వివిధ రకాల కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి తర్వాత క్రమంగా ఊహించని విధంగా బిల్లులు వసూలు చేయనున్నారు. విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు, మెయింటెనెన్స్, లైన్ లాస్, సేవలు అందించినందుకు లాభం ఇలా అన్నీ కలిపి ప్రస్తుతం అందిస్తున్న యూనిట్ ధరకు ఎన్నో రెట్లు పెంచనున్నారు. దీంతో ‘అమ్మో కరెంట్ బిల్లా’అనే పరిస్థితి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
వినియోగదారుడా.. మేలుకో..
నూతన విద్యుత్ చట్టంతో ఉత్పత్తి, సరఫరా, పంపిణీ పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. డ్యాం సేఫ్టీ బిల్లు ద్వారా డ్యాంలను, పోర్టుల సవరణ బిల్లు ద్వారా చిన్న పోర్టులను, జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు ద్వారా వైద్య విద్యను, ట్రాన్స్పోర్ట్ బిల్లు ద్వారా రవాణా రంగాన్ని, నూతన విద్యా విధానం ద్వారా విద్యా రంగాన్ని కేంద్రం క్రమంగా తన పరిధిలోకి తీసుకుంటున్నది. నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయం కూడా తాను చెప్పినట్లే నడవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రైతన్నల పోరాటంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. అయితే, నూతన విద్యుత్ చట్టంతో విద్యుత్ రంగం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇదే జరిగితే.. రాష్ర్టాల పరిధిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లు ఉండవు. విద్యుత్ రంగంపై అంతా కేంద్రం పెత్తనమే ఉంటుంది. వ్యవసాయానికి, పేదలకు, ఇతర రంగాలకు సబ్సిడీ మీద తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే అవకాశమే ఉండదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. మరోవైపు విద్యుత్ ఉద్యోగులు సైతం జాతీయ స్థాయిలో జేఏసీగా ఏర్పడి పోరాటం సాగిస్తున్నారు. అయితే, సాధారణ ప్రజలు మాత్రం ఇంకా ఈ అంశంపై గళాన్ని వినిపించడం లేదని పలువురు చెబుతున్నారు.
రైతుల పరిస్థితి మరింత కష్టం..
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద భారీగా పంటలు సాగవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఊహించని విధంగా ఆయకట్టు పెరిగింది. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ రాకతో రైతులంతా సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారు. కొత్త విద్యుత్ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే ఇకపై రైతుల మోటర్లకు మీటర్లు తప్పనిసరి చేస్తారని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. నెలకు 200 యూనిట్లు వాడితే తక్కువలో తక్కువ రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు బిల్లులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రైతులతోపాటు అనేక పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నది. కులవృత్తులు, కుటీర పరిశ్రమలు, సెలూన్లు, దోబీఘాట్లకూ సబ్సిడీలున్నాయి. కేంద్రం చట్టం ఆమోదిస్తే ఇవన్నీ పోతాయి. అందరూ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ రంగం కాబట్టి విద్యుత్ బిల్లు ఎప్పటికప్పుడు కడితేనే విద్యుత్ వస్తుంది. లేదంటే మరుక్షణమే కరెంట్ కట్ అవుతుంది.
భవిష్యత్‌లో ఓపెన్ మార్కెట్..
కొత్త విద్యుత్ చట్టం ఏర్పాటు చేసిన తర్వాత విద్యుత్ పంపిణీ వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆపరేటర్ విద్యుత్ విక్రయించే పరిస్థితి వస్తుంది. ఓపెన్ మార్కెట్లో ఎవరిష్టానుసారం వాళ్లు కరెంట్ అమ్ముకునే పరిస్థితి వస్తుంది. వెరసి వినియోగదారులపై పెద్ద ఎత్తున భారం పడుతుందనేది నిపుణుల మాట. ప్రస్తుతం బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ను నడిపిస్తున్నది. కానీ కేంద్రం మాత్రం అన్నింటా లాభాలే ఆశిస్తూ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ రంగాన్ని తన గుప్పిట పట్టేందుకు సిద్ధమైంది. ఇది చాలా దుర్మార్గమైన విషయమని విద్యుత్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్‌లో వ్యవసాయ రంగంతోపాటు పరిశ్రమలు, ఇతర రంగాలు కునారిల్లే ప్రమాదం ఉన్నది.
సర్వ నాశనమే..
కొత్త చట్టం తీసుకొస్తే ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ రంగం కేంద్రం పరిధిలోకి వెళ్తుంది. రాష్ట్ర పరిధిలో ఉన్న రెగ్యులేటరీ కమిషన్ కేంద్రం తన పరిధిలోనే ఏర్పాటు చేస్తుంది. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ప్రైవేటీకరణ చట్టం వస్తే ధరలు పెంచుతారు. రైతుల మోటర్లకు మీటర్లు బిగిస్తారు. ఉచిత విద్యుత్ ఉండదు. రైతు 200 యూనిట్లు వాడితే.. యూనిట్‌కు రూ.20 అనుకున్నా నెలకు కనీసం రూ.4 వేలు చెల్లించే పరిస్థితి వస్తుంది. సబ్సిడీ కరెంట్ అందదు. డబ్బులు కట్టే పరిస్థితి లేకుంటే క్షణాల్లో కరెంట్ కట్ చేస్తారు. బీఎస్ఎన్ఎల్ పరిస్థితి కూడా ఇలాగే మారింది. మొదట ఉచితంగా సర్వీస్ ఇచ్చి.. ఖతం చేశారు. విద్యుత్ రంగం పరిస్థితి కూడా అలాగే ఉండబోతున్నది. ఆదానీ, అంబానీ లాంటి వాళ్లు అన్ని రంగాలతోపాటు విద్యుత్ రంగంలోకి వస్తే, కొత్త విద్యుత్ చట్టం ప్రారంభమైతే సర్వనాశనం అవుతుంది. ప్రైవేట్ రంగానికి దోచిపెట్టే క్రమంలో పేదలపై ఊహించని భారం పడుతుంది. కాబట్టి అందరూ మేల్కొనాలి. కేంద్రం తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై గొంతెత్తాలి.
ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలి..
కొత్త విద్యుత్ చట్టంపై దేశవ్యాప్తంగా నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీర్స్ పేరిట జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళనలను ఉధృతం చేశాం. కేంద్రం తీరును నిరసిస్తూ అన్ని రాష్ర్టాల ఉద్యోగులు, సంఘాలు ఓ తాటిపైకి వచ్చాయి. ఇది దేశంలోని అందరి సమస్య. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పాస్ చేయాలని చూస్తున్నారు. ఈ చట్టం వస్తే అంతా ఆగమాగం అవుతుంది. ఇప్పటికే విద్యుత్ రంగంలో అనేక పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కొత్త చట్టం వస్తే ఖాళీల భర్తీ దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెడతారు. ఒక్క ఉద్యోగులకే కాకుండా రైతులపై నేరుగా భారం పడుతుంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉండగా.. భవిష్యత్‌లో విద్యుత్ పంపిణీ చేసే కంపెనీలు కూడా ప్రైవేట్‌వి వస్తాయి. దీంతో అన్ని రంగాలపై ప్రభావం పడుతుంది. ఇది కేవలం విద్యుత్ ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు. ప్రజలందరి సమస్య. మేల్కోకుంటే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. పెట్రోల్ ధరల్లాగా రోజువారీగా కరెంట్ బిల్లులు కూడా పెంచుకుంటా వెళ్లే అవకాశం ఉన్నది.