
పాలకవీడు, డిసెంబర్ 9 : నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తర్ణ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 70శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫ్యాక్టరీలకు రాయితీ కల్పించేలా కృషి చేస్తానన్నారు. ఫ్యాక్టరీలో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, అన్ని రకాల వసతులు కల్పించాలని, వారి కుటుంబాల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాలకు మౌళిక వసతుల కల్పించాలని, జాన్‌పహాడ్ దర్గా ఆభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. స్థానిక యువతకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కాలుష్య అంచనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపర్చాలని సూచించారు. రావిపహాడ్, శూన్యపహాడ్, మహంకాళిగూడెం, జాన్‌పహాడ్ గ్రామ ప్రజలు సంపూర్ణ ఫ్యాక్టరీ విస్తరణకు మద్ధతు ప్రకటించారు. అంతకముందు జాన్‌పహాడ్ దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహంచారు. జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కౌషిక్ పాటిల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ రఘు, సీఐ రామలింగారెడ్డి, కాలుష్య నియంత్రణ కంట్రోల్ బోర్డు ఈఈ రాజేందర్, ఎంపీపీ గోపాల్, తాసీల్దార్ రాంరెడ్డి, ఫ్యాక్టరీ డైరెక్టర్ శ్రీనివాస్, జీఎం నాగమల్లేశ్వర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి, సర్పంచులు శ్వేతా విజయ్, కృష్ణారెడ్డి, కురపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సంకినేని వరుణ్‌కు చేదు అనుభవం…
ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన బీజీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు కుమారుడు సంకినేని వరుణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా స్థానికులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. రాజకీయం చేయడానికి ఇది వేదిక కాదని, ఫ్యాక్టరీ విస్తర్ణకు తాము పూర్తి మద్దతు ఇస్తుంటే తప్పడు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. డీఎస్పీ రఘు ప్రజలకు సర్దిచెప్పి వరుణ్‌కు మాట్లాడడానికి అవకాశం కల్పించారు. ఈ ప్రాంత ప్రజలతో సంబంధం లేని వ్యక్తిని ప్రజాభిప్రాయ సేకరణకు ఎలా అనుమతిస్తారని స్థానికులు ప్రశ్నించారు.