నిజామాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ చేపట్టిన 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చక్కని ఫలితాలను ఇస్తున్నది. మూడేండ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అమలైన నిరంతర విద్యుత్ సరఫరా ఇప్పుడు నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. మూడేండ్లుగా చిన్నఅంతరాయం కూడా లేకుండా సాగుకు, గృహ, వాణిజ్య అవసరాలకు విద్యుత్ సరఫరా నిరాటంకంగా సాగుతున్నది. కుదేలైన సాగు రంగాన్ని చక్కని మార్గంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతో రైతు లోకానికి ఎనలేని లాభాన్ని చేకూరుస్తున్నది. అంతేకాకుండా వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సాగు చేయాలంటే సాధారణంగా వానకాలం సాగు కాలాన్ని రైతులంతా మొగులుపై ఆధారపడి చేసేవారు. యాసంగి సీజన్ వచ్చిందం టే తప్పనిసరిగా భూగర్భ జలమో, కాలువల కింద నో పొలాలు వేసేది. నిరంతర విద్యుత్‌తో కాలానికి సంబంధం లేకుండానే ఏడాదికి రెండు పంటలు సమృద్ధిగా పండుతుండడం సాగుకు నిరంతర విద్యుత్ పుణ్యమేనని చెప్పక తప్పదు.
7.66లక్షల విద్యుత్ కనెక్షన్లు…
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7లక్షల 66వేల 196 విద్యుత్ కనెక్షన్లున్నాయి. కేటగిరీ -1(గృహ సముదాయ) కనెక్షన్లు – 5లక్షల 3వేల 103, కేటగిరీ -2(వాణిజ్య సముదాయాలు) – 69,300, కేటగిరీ 3 -(పరిశ్రమలు) – 3705, కేటగిరీ 4 -(కుటీర పరిశ్రమలు) – 991, కేటగిరీ 5 – (వ్యవసాయ కనెక్షన్లు) – 1లక్ష 73వేల 599 కనెక్షన్లున్నాయి. కేటగిరీ 6 – (స్ట్రీట్ లైట్స్, వాటర్ వర్క్స్) – 11,293 కనెక్షన్లు, కేటగిరీ -7(దేవాలయాలు, మసీదులు, చర్చీలు – సాధారణ వినియోగం) – 3,646 కనెక్షన్లు, కేటగిరి 8 – (తాత్కాలిక) – 168 కనెక్షన్లున్నాయి. జిల్లా వ్యాప్తంగా 9.6 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లున్నాయి. ప్రస్తుతం ఆయా వర్గాల నుంచి వస్తున్న విద్యుత్ డిమాండ్ 8.6 మిలియన్ యూనిట్లుగా రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపి ణీ సంస్థ అధికారులు చెబుతున్నారు. గతంలో వేసవి కాలం వచ్చిందంటే విద్యుత్ అవసరాలు పెరిగి సరిపడా కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తేది. ఓవర్‌లోడ్ సమస్య ఎదురైనప్పటికీ ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టవంతంగా ఏర్పాట్లు చేసింది. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్‌లో ఆటంకం అనేది కనిపించకుండా చేశారు. రైతులు దర్జాగా సాగు చేసుకునేలా కరెంట్ వసతి ప్రతి పల్లెలోనూ కనిపిస్తున్నది.
దిగ్విజయంగా మూడేండ్లు పూర్తి…
2014కు ముందు రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లాలంటే రైతులు జంకే పరిస్థితి. విష పురుగుల బెడద, విద్యుత్ ప్రమాదాలతో కబళించే మృత్యువుతో రైతులు పడరాని పాట్లు పడ్డారు. అప్రకటిత విద్యుత్ కోతలు, వేళాపాలా లేని సరఫరా తీరుతో విసుగెత్తి పోయారు. భూగర్భ జలం ఉన్నా కరెంట్ లేక కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటను నష్టపోయిన పరిస్థితులు సమైక్యాంధ్ర పాలకుల హయాంలోనివి. కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఆర్థిక భారంగా మరమ్మతులతో మోటర్ల వద్దనే అన్నదాతలు రోజుల తరబడి నిరీక్షణ… నాడు నిత్యకృత్యమైన ఘటనలు. సీన్ కట్ చేస్తే… లోటు విద్యుత్‌తో రాష్ట్రంలో తొలి పాలన మొదలైన నాటి నుంచి నేడు సాగుకు 24గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేసే స్థాయికి రాష్ట్రం గెలిచి నిలిచింది. సీఎం కేసీఆర్ దార్శనికతతో పరిపాలన మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే కరెంట్ ఇక్కట్లు పోగొట్టగా… తొలి రోజుల్లో సాగుకు 9గంటల నిరంతర విద్యుత్ సౌకర్యంతో సత్తాను చాటారు. చీకట్లను చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో రైతుల మేలు కోసం జనవరి 1, 2018 నుంచి 24గంటల పాటు నిరంతరంగా కరెంట్‌ను అందిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధం గా నిరంతర విద్యుత్ కొనసాగుతున్నది. మూ డేండ్లు పూర్తి చేసుకున్న ఈ అద్భుత కార్యక్ర మం నాలుగో ఏట అడుగు పెట్టింది.
నిరంతర కరెంట్‌తో పెరిగిన సాగు విస్తీర్ణం
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కరెంట్ సరఫరాకు ఇక్కట్లు లేకుండా ఉండేందుకు పకడ్బందీగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం, విద్యుత్ కొత్తలైన్ల వంటి పనులు పూర్తి చేశారు. 2017 వానకాలం సీజన్లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా జిల్లాల్లో జూలై 18న నిరంతర విద్యుత్తు సరఫరాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వర్షాలు లేకపోవడం, మరోవైపు భూగర్భ జలాలు తగ్గినప్పటికీ నిరంతర విద్యుత్ కాస్తంత రైతుల్లో ధైర్యాన్ని నింపింది. గతంలో కీలక సమయంలో విద్యుత్ కోతలు అధికంగా ఉండడంతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయేది. ఇప్పుడు రాత్రింబవళ్లు విద్యుత్ కోసం ఎదురు చూసే ఇబ్బందులు తొలగిపోయాయి. పంటలకు సకాలంలో సమృద్ధిగా నీరు అందడంతో రైతులకు ప్రధానమైన ఇబ్బంది పూర్తిగా తొలగిపోయింది. నిజామాబాద్ జిల్లాలో మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఒకప్పుడు వ్యవసాయ పొలాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే గగనం.
దీంతో బోర్లు లేక చక్కని వ్యవసాయ భూములు పడావుగా మారేవి. రైతుకు విద్యుత్ కనెక్షన్ రావాలంటే సంబంధిత అధికారులకు లంచాలు ఇస్తే కానీ కనెక్షన్ మంజూరు అయ్యే ది కాదు. కనెక్షన్లు ఇచ్చినా చీటికి మాటికి ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు, బోర్లు చెడిపోవడం వంటి కష్టాలు నిత్య కృత్యమే. ఫలితంగా ఆర్థిక భారం విపరీతంగా రైతులపై పడేది. సాగుకు నిరంతర విద్యుత్ మూలంగా రైతులకు భారీ ఊరట కలుగుతున్నది.