
యాదాద్రి, జననరి 2 : ఆలేరు నియోజకవర్గంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న 12 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 6 లక్షల చొప్పున నష్టపరిహారం మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరబోతుందని మీడియాకు వివరించారు. 2015-16లో అప్పుల బాధతో నియోజకవర్గంలోని యాదిరిగుట్ట మండలంలోని కాచారం గ్రామానికి చెందిన అనిరెడ్డి నర్సిరెడ్డి, మహబూబ్పేటకు చెందిన తిరుమని సంతోష, వంగపల్లికి చెందిన కానుగు ఆంజనేయులు, ఆలేరులోని బహదూర్‌పేట గ్రామానికి చెందిన ఖమ్మంపల్లి సిద్ధులు, కొలనుపాకకు చెందిన గవ్వల యాదగిరి, రాజాపేట మండలం కాల్వపల్లికి చెందిన బింగి అయిలయ్య, దూది వెంకటాపురానికి చెందిన వస్పరి బాలమణి, ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్‌కు చెందిన జక్క నర్సిరెడ్డి, ఆత్మకూరు(ఎం)కు చెందిన ఎలిమినేటి యాదిరెడ్డి, మోటకొండూర్ మండలంలోని చామపూరుకు చెందిన అంతటి జయమ్మ, దిలావర్పూర్కు చెందిన పల్లా సత్యపాల్‌రెడ్డి, తుర్కపల్లి మండలంలోని గోపాలపురానికి చెందిన పాముల ఓజయ్య మృతి చెందారు. వారికి నామినీగా ఉన్న వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.6 లక్షల నష్టపరిహారం జమ అవుతాయని తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించి కొత్తగా డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకం తీసుకువచ్చి ప్రభుత్వం రైతులకు పెట్టుబడిసాయం అందిస్తున్న దని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కృషి, ప్రణాళికతో ఏడేండ్లలోనే రాష్ట్రం పచ్చని మాగాణిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,12,656 మంది రైతుల ఖాతాల్లో తొలిరోజు రూ.544.55 కోట్ల పెట్టుబడి సాయం జమైనట్లు తెలిపారు.