
తొగుట, జనవరి 3: ఒక రైతు కష్టం మరో రైతుకే తెలుస్తుంది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కాంగ్రెసోల్లు, తెలుగుదేశమోల్లు రాష్ర్టాన్ని పాలించినప్పటికీ.. రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవుసం దండుగ అన్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బిడ్డగా రైతుల కోసం పనిచేస్తున్నాడు. మేము మొదటి నుంచి కూరగాయలు సాగు చేసేవాళ్లం. గతంలో 6 గంటల కరెంటు పొద్దున, రాత్రి వచ్చేది. రాత్రిళ్లు నిద్రపోకుండా పొలం కాడికి పోయేటోళ్లం. ఇప్పుడు సీఎం కేసీఆర్ పుణ్యమా అని 24 గంటల కరెంటు సరఫరా అవుతుండడంతో ఎప్పుడు అంటే అప్పుడు పొలం పారబెట్టుకుంటున్నం. కేసీఆర్ చొరవతో కరెంటు బాధలు పోయినయ్. చెరువు, కుంటలు బాగుచేయడంతో నీళ్లు పుష్కలంగా ఉన్నయి. ఎంత కష్టపడి పనిచేస్తే పంటలు అంత బాగా పండుతున్నయి. రైతును రాజుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన రైతు సుతారి రాములు అంటున్నడు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ రాజ్యం గురించి ఆయన మాటల్లోనే….
ప్ర : రైతుబంధు ద్వారా మేలు జరుగుతున్నదా…?
జ: రైతుబంధు పథకం రైతులకు కష్టకాలంలో అండగా నిలస్తున్నది. గతంలో వానలు కొట్టగానే నాగలి దున్నుడు పక్కన పెట్టి దుక్కిమందు, యూరియా కోసం గజ్వేల్, సిద్దిపేట, తొగుటకు వెళ్లే వాళ్లం. చాంతాడంత లైన్లో నిలబడి నిలబడి కాళ్లు గుంజితే చెప్పులు లైన్ల పెట్టేవాళ్లం. పెట్టుబడి కోసం వ్యాపారుల వద్ద అప్పులు చేసేటోళ్లం. భార్య బంగారం తాకట్టు పెట్టి వడ్డీకి తెచ్చేవాళ్లం. సీఎం కేసీఆర్ వచ్చినంక నాలుగేండ్లుగా రైతుబంధు వస్తుండడంతో పెట్టుబడి కష్టాలు దూరమయ్యాయి. కరోనా సమయంలో కూడా అకౌంట్లో డబ్బులు వేసి ఆపద సమయంలో ఆదుకున్నడు. నాకు 3.20 ఎకరాల భూమి ఉంది. రూ.17,500 వచ్చినయి. చాలా సంతోషంగా ఉంది.
ప్ర: రైతుబీమాతో మేలు జరుగుతున్నదా..?
జ: ఇంత మంచి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదనుకుంటా నాకు తెలిసి. గతంలో రైతు చనిపోతే పట్టించుకున్న నాథుడే లేడు. వారి పిల్లలు ఆగమయ్యేటోళ్లు. అప్పుల బాధతో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారికి పరిహారం కూడా రాకపోయేది. తహసీల్దార్లు విచారణ పేరుతో ఆగం చేసేవాళ్లు. నేడు రైతు బీమా ద్వారా పదిహేను రోజుల్లోనే రూ. 5లక్షలు వస్తుండడంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక ధీమా లభిస్తున్నది. మా ఊర్లోనే 10 మంది రైతులకు బీమా డబ్బులు వచ్చినయి.
ప్ర: కరెంటు కష్టాలు పోయినట్టేనా…?
జ: కరెంటు బాధలు పోయినయి. సీఎం కేసీఆర్ సార్ 24 గంటలూ నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పొలం పారబెట్టుకుంటున్నం. గతంలో రాత్రిళ్లు పొలం కాడ కరెంటు కోసం పడిగాపులు కాసేవాళ్లం. లో ఓల్టేజీ కరెంటుతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. నేడు ఆ బాధలు తప్పినయి.
ప్ర: యాసంగిలో వరి సాగు చేస్తున్నవా..బీజేపీ ప్రభుత్వం
ఏమన్నా మేలు చేస్తున్నదా..?
జ: నాకు మూడున్నర ఎకరాలుంది. అందులో రెండెకరాల పదిగుంటల్లో కాకర, క్యాలీఫ్లవర్, వంకాయ, క్యాబేజీ, బుడిమ కాయ, బంతి తోట, టమాటా లాంటి కూరగాయలు పండిస్తున్నా. మిగిలిన ఎకరా పది గుంటలో వరి వేస్తున్న. కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు. యాసంగి వరి కొని రైతులను ఆదుకోవాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్ కోల్పోవాల్సి వస్తది.
ప్ర: కూరగాయల సాగు ఎలా ఉంది..?
జ: కూరగాయల సాగు బాగుంది. నేడు ఏటా 2.10 ఎకరాల్లో కూరగాయలు, పూల పంటలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నా. కూరగాయలను రోజూ సిద్దిపేట రైతుబజార్‌కు తీసుకెళ్లి అక్కడ స్వయంగా విక్రయిస్తా. మంత్రి తన్నీరు హరీశ్‌రావు సార్ రైతు బజార్‌ను ఏర్పాటు చేయడంతో దళారుల బెడద తప్పింది.