సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ);ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ అటు అన్నదాతలను ఇటు సామాన్యులను ఏడిపించుకు తింటున్న కేంద్ర ప్రభుత్వంపై సోమవారం నగరవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా ఏక పక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై నగర టీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అయ్యాయి. వడ్లు కొనకుండా పూటకో మాట మారుస్తూ రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారంటూ ప్లకార్డులు, నల్లజెండాలు ప్రదర్శించారు. రైతును కష్టపెడితే ఆ పాపం ఊరికే పోదని హెచ్చరించారు. ఢిల్లీలో ఒకలాగ గల్లీలో మరొక లాగ వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. రాష్ట్ర బీజేపీ నేతలతో ఎలాంటి ఉపయోగం లేదని ‘బడా చోర్ బీజేపీ.. బట్టేబాజ్ బీజేపీ’ అంటూ శాపనార్థాలు పెట్టారు. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నగర వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన కూడళ్లు, రహదారులపై నిరసనలతో హోరెత్తించారు. ఘట్కేసర్లో మంత్రి మల్లారెడ్డి, కందుకూరులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ మోదీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి పుట్టగతులుండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శవపేటికపై పెట్టి చావు డప్పులు మోగించి అంతిమయాత్ర నిర్వహించాచారు. రైతు బాగుపడాలంటే బీజేపీని గద్దె దించడమే ప్రతిఒక్కరి లక్ష్యం కావాలని కోరారు.
వడ్ల కొనుగోళ్లపై గ్రేటర్ టీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం గ్రేటర్ వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు , పార్టీ ముఖ్య నేతలంతా ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రధాన కూడళ్లు, రహదారులపై నిరసనలతో హోరెత్తించారు. ఘట్కేసర్లో మంత్రి మల్లారెడ్డి, కందుకూరులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ మోదీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మనుశవపేటికపై పెట్టి చావుడప్పులతో అంతిమయాత్ర నిర్వహిస్తూ వినూత్న నిరసన చేపట్టారు.రైతు బాగుపడాలంటే బీజేపీ గద్దె దిగాల్సిందేనని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
రైతుల నిరసనలు ఉధృతం చేస్తాం
వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం దిగిరానట్లయితే రైతులకు పక్షాన నిరసనలను మరింత ఉధృతం చేస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా యాసంగి వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వరంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనాలు, చావు డప్పు కార్యక్రమాలు నిర్వహించారు. ఘట్కేసర్ మండలం ఎదులాబాద్‌లో జరిగిన నిరసనలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగించారు. వడ్ల కొనుగోళ్లపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, లేనట్లయితే దేశ రాజధానిలో కేంద్రంపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ చేసిందేమీలేదని, గ్రామ గ్రామాన బీజేపీ నాయకులను నిలదీయాలన్నారు. పంటలు పండించడం రాష్ట్రం బాధ్యత.. దాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. నిరసనలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పావనీయాదవ్, కొండల్‌రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి రైతునాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతులపై కేంద్రం వివక్ష
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్ల కొనుగోలుపై తన బాధ్యతను విస్మరిస్తూ రైతులను రోడ్డుపాలు చేస్తున్నది. ఇక్కడి బీజేపీ నాయకులు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా మాట్లాడటం విడ్డూరం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నది.