భువనగిరి అర్బన్, జనవరి 3 : జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాలరక్షక్ వాహనం అందుబాటులోకి తెచ్చినట్ల కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఆమె బాలరక్షక్ వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడేందుకు ప్రభుత్వం బాలరక్షక్ వాహనం ఏర్పాటు చేసిందన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్‌తో నవంబర్ 14న రాష్ట్రం మొత్తం 33వాహనాలను అన్ని జిల్లాలకు కేటాయింపులో భాగంగా జిల్లాకు వాహనం కేటాయించినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న పిల్లలు ఎక్కడ కనబడినా 1098 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేస్తే అధికారులు వచ్చి పిల్లల రక్షణ, సంరక్షణ చూసుకుంటారని తెలిపారు. జిల్లాలోని బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత శాఖాధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న బాలల వద్దకు అధికారులే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి, బాలల పరిరక్షణాధికారి పి.సైదులు, సీడబ్ల్యూసీ చైర్మన్ బండారు జయశ్రీ, సభ్యులు కే.మల్లేశ్ పాల్గొన్నారు.
ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 71ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వాటిలో 57 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినవి కాగా, మిగతావి ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.