హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 28: భవన నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో మండలంలోని ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. చాలా వరకు అనుమతులు లేకుండానే కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. హుజూరాబాద్ మండలంలోని దాదాపుగా 50కి పైగానే ఇటుక బట్టీలు ఉన్నాయి. మండలంలోని రాంపూర్, రంగాపూర్, తుమ్మనపల్లి, చిన్నపాపయ్యపల్లి, సిర్సపల్లి తదితర గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వ్యాపారులు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇటుకలను తయారీ చేయడానికి ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కార్మికులను తీసుకువస్తుంటారు.
అనుమతులు లేకుండానే ఏర్పాట్లు
ఇటుక బట్టీల ఏర్పాటుకు ఆయా గ్రామ పంచాయతీలతో పాటు రెవెన్యూ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలి, కానీ కొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లోనూ బట్టీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే నాలా సుంకం చెల్లించాలి. కానీ రైతులకు డబ్బు ఎర చూపి నాలా సుంకం చెల్లించకుండానే వ్యాపారం చేస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తూ ఇటుకల తయారీకి వినియోగిస్తున్నారు.
ప్రధాన రహదారుల వెంట బట్టీలు
హుజూరాబాద్ మండలంలోని జమ్మికుంట, కరీంనగర్, పరకాల, వరంగల్ రహదారుల పక్కనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలికి బూడిద కొట్టుకువచ్చి కండ్లల్లో పడడం, ఇటుకు బట్టీల నుంచి వెలువడుతున్న పొగతో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
బాల కార్మికులతోనూ పనులు
ఇటుక బట్టీల వ్యాపారులు ఎక్కువగా ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కార్మికులను తీసుకువస్తుంటారు. ఇందులో బాల కార్మికులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రతి ఇటుక బట్టీ వ్యాపారి వద్ద సుమారు నలుగురు నుంచి ఐదుగురు వరకు బాల కార్మికులు పని చేస్తుంటారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.