భద్రాద్రి కొత్తగూడెం,(నమస్తేతెలంగాణ) జనవరి 9: ఒమిక్రాన్, కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయగా రెండో డోసు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. తాజాగా రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసూ వేయాలని నిర్ణయించింది. భద్రాద్రి జిల్లాలో టీకా ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాత కొత్తగూడెం అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ అనుదీప్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డీఎంహెచ్‌వో శిరీష, జిల్లా ఇమ్యూనైజేషన్ ప్రోగాం అధికారి నాగేంద్రప్రసాద్ పర్యవేక్షణలో వైద్యసిబ్బంది పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. టీకా తీసుకునేవారు ఆధార్ కార్డు, ఐడీ కార్డులతో టీకా కేంద్రానికి రావాలి.
రెండు డోసులు తీసుకున్న వారికే..
జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుత్రిలో మొత్తం 40 కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. ఇప్పటికే వారి జాబితాను సిద్ధం చేశారు. వైద్యసిబ్బంది తొలుత హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏండ్లు దాటిన వారికి టీకా ఇస్తారు. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారు మాత్రమే బూస్టర్ డోస్‌కు అర్హులు. జిల్లావ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్లు 8 వేల మంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు 9 వేల మంది, 60 ఏళ్లు దాటిన వారు 90 వేల మంది ఉన్నారు. వీరందరికి టీకా అందునున్నది.
టీకాకు పకడ్బందీగా ఏర్పాట్లు
బూస్టర్ డోస్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. నేటి నుంచి జిల్లావ్యాప్తంగా 40 కేంద్రాల్లో టీకాలు వేస్తాం.పాత కొత్తగూడెంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ అనుదీప్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. టీకా తీసుకునే వారు ఆధార్‌కార్డు తీసుకురావాలి.