జహీరాబాద్, డిసెంబర్ 19 : రైతులతో రాజకీయాలు చేస్తే బీజేపీ పుట్టగతులుండవని, యాసంగిలో వడ్లు కొనేవరకూ పోరాటం చేస్తామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైతులు బీజేపీకి ఘోరీ కట్టడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంచి పేరు రావడంతో కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక కుట్రపూరితంగా వ్యవరిస్తున్నదన్నారు. వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుందన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనలేమని చెబుతుంటే.. తెలంగాణ బీజేపీ నాయకులు వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ఊరూరా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. వడ్ల కొనుగోళ్లలో కేంద్ర మం త్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో అమలు చేసే సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జహీరాబాద్ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా వంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు వర్తించవన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహినొద్దీన్, నాయకులు ఎంజీ రాములు, ధనసిరి శ్రీనివాస్‌రెడ్డి, డప్పూర్ రవీందర్, రాచయ్యస్వామి, నర్సింహులు, జి.గుండప్ప, కిషన్ పవార్, భాస్కర్, పెంటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.